సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు షాక్ తగిలింది. అమరావతి(Amaravati) పిటిషన్లపై విచారిస్తున్న సుప్రీంకోర్టు(Supreme Court)..దీనిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. ఈ విజ్ఞప్తిని సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు(AP High Court) ఇచ్చిన చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి విచారించింది. జనవరి 31వ తేదీ నాడే ఈ పిటీషన్లు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ.. అందులో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీంతో నేటి విచారణపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇక హైకోర్టు తీర్పునే అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అమరావతి రైతులు ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఇక ఈ కేసుకు సంబంధించి కేంద్రం తన వైఖరి చెప్పాలంటూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసంది. దీనిపై స్పందించిన కేంద్రం..అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. అయితే ఏపీ ప్రభుత్వం ఆశించిన విధంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో.. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
AP Group-1 Mains: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా..కొత్త డేట్స్ ఇవే..
Pulivendula Firing Incident: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి.. నిందితుడు ఎవరంటే..
సుప్రీంకోర్టు తమ వాదనకు అనుకూలంగా ఆదేశాలు ఇస్తే.. జూలై నాటికి ఏపీలోని విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే జులై నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని ఏపీ సీఎం జగన్ కూడా పలుసార్లు స్పష్టం చేశారు. ఈలోపుగానే న్యాయపరమైన చిక్కులు తొలిగిపోతాయమని పలువురు వైసీపీ ముఖ్యనేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందన్నది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.