Cyclone Effect on Uttarandhra: ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగబట్టినట్టు ఉన్నాడు. అందుకే వర్షాకాలం పోయినా వానలు మాత్రం కుమ్మేస్తున్నాయి. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా వరదలు ముంచెత్తుతున్నాయి. మొన్నటి వరకు రాయలసీమను వర్షాలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లు పడిందా అనేలా కుండపోత వర్షాలు కురిశాయి. దానికి తోడు ఎగువ నుంచి వచ్చిన వరదలతో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా తిరుపతి పరిస్థి మరీ దారుణంగా తయారైంది. ఇప్పుడు వాన పేరు వింటేనే అక్కడి ప్రజలు భయపడాల్సి వస్తోంది. అంతలా అతలాకుతలం చేశాయి వానలు. ఇప్పుడు తుపాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దక్షిణ థాయ్లాండ్ దగ్గర అండమాన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంటే అది ప్రస్తుతం అల్పపీడనంగా బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. అయితే దీని ప్రభావం మూడు జిల్లాలపైనా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక డిసెంబర్ 2వ తేదీకి వాయుగుండంగా, 3వ తేదీకి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం తుపానుగా బలపడితే దీనికి జవాద్ అని పేరు పెట్టనున్నారు. ఈ జవాద్ తుఫాను ఈ నెల నాలుగవ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపు వచ్చి బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
జవాద్ ప్రభావం అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ పైనే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 2వ తేదీ నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హచ్చరిస్తున్నారు. కేవలం ఉత్తరాంధ్రకు మాత్రేమ కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది తప్పక పోవచ్చు. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ఈ తుఫాను కారణంగా గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, ఈ ఐదు జిల్లాల రైతులు పంటలు పాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చానారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి వచ్చేయాలని కోరారు.
నెల్లూరును మాత్రం వానలు వరద వదలడం లేదు. మొన్న కురిసిన భారీ వర్షాలకు వాగులు, చిన్నపాటి ఉపనదులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై–కోల్కతా జాతీయ రహదారి గూడూరు ఆదిశంకర కళాశాల వద్ద దెబ్బతినడంతో వాహనాలు నిలిచిపోయాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు ఉప్పొంగి కోల్కతా, చెన్నై రహదారిపై ప్రవహించింది. దీంతో ఎక్కడికక్కడ రోడ్డు దెబ్బతింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. అక్కడి పరిస్థితి ఎప్పటికి తెరిపిస్తుందో తెలియడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cyclone alert, Visakhapatnam