హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: పుచ్చలేచిపోవడం అంటే ఇదే..! కొండముచ్చు ఎంతపని చేసింది..!

Andhra Pradesh: పుచ్చలేచిపోవడం అంటే ఇదే..! కొండముచ్చు ఎంతపని చేసింది..!

కొండముచ్చు దాడిలో వ్యక్తికి గాయాలు

కొండముచ్చు దాడిలో వ్యక్తికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరు (Guntur) జిల్లాలో కొండముచ్చు ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఒళ్లో కూర్చున్నట్లే కూర్చొని తలను చీల్చేసింది

జంతువులతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి. మనుషులు వాటిని మచ్చిక చేసుకున్నా.. కోపం వస్తే మాత్రం తన మన అనేది చూడవు దాడి చేసేస్తాయి. ఈ విషయంలో కుక్కలు, పిల్లులు, పందుల లాంటి వాటితో యజమానులు, బయటవారికి పెద్దగా ఇబ్బందులుండవ్ కానీ. కోతులు, ఏనుగుల వంటివాటితో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలాంటి జంతువులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అప్పటివరకు ప్రేమగా ఉన్న జంతువులే సడన్ గా మూడ్ మారితే తీవ్రంగా గాయపరుస్తాయి. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.., గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం, జూలకల్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై కొండముచ్చు దాడి చేసింది. వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చిన కొండముచ్చు ఉన్నట్లుండి గ్రామస్తుడిపై దాడికి ఏకంగా అతని పుచ్చ లేపేసింది.

అసలేం జరిగిందంటే..!

జూలకల్లు గ్రామంలోని చెట్టు కింద కొందరు కూర్చొని మద్యం సేవిస్తుండగా కొండముచ్చు అక్కడికి వచ్చింది. కాసేపు అటు ఇటు తిరిగి వారి గుంపులో కూర్చుంది. మందు చూసి మనసు పడిందో ఏమో.., పనిలో పనిగా ఓ పెగ్గు లాగించింది. ఆ మత్తులోనే ఓ వ్యక్తి ఒళ్లో కూర్చుంది. ఇంతలో దానిని ఏదో అన్నాడు. నన్నే ఎగతాళి చేశాడనుకుందో ఏమో తెలియదుగానీ నోటితో జుట్టుపట్టుకొని గట్టిగా లాగింది. అంతే జట్టుతో పాటు చర్మం కూడా ఊడి కిందపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే తలపై చుట్టును విగ్గును పీకినట్లు పీకిపారేసింది. దీంతో రక్తం కారుతున్న తలతోనే అతడు ఆస్పత్రికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. స్థానిక వైద్యులు అతడి తలకు కట్టుకట్టి, సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు.


గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు కొండముచ్చును పట్టుకునేందుకు తీవ్రంగా యత్నించారు. వారిని మూడు రోజులుగా అది ముప్పతిప్పలు పెడుతోంది. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చే సమయానికి గోడలు దూకడం, ఇళ్లపై ఎక్కి కూర్చోవడం చేస్తున్నాయి. అలాగే కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు ఇచ్చి పెడుతున్నా ఒక్క సిప్ వేసి పారిపోతుందని అధికారులు చెప్తున్నారు. వ్యక్తిపై దాడి చేసిన కొండముచ్చు మాత్రం ఎవర్నీ ఏమీ అనడం లేదని.. తన జోలికి వస్తే మాత్రం చుక్కలు చూపిస్తోందని గ్రామస్తులు చెప్తున్నారు. కొండముచ్చు వలలో చిక్కితే దానిని స్వేచ్ఛగా అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఐతే అది మాత్రం ఇప్పట్లో వారికి చిక్కేలా కనిపించడం లేదు.

First published:

Tags: Andhra Pradesh, Guntur

ఉత్తమ కథలు