Chandrababu Naidu News:ఏపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలను గాడిన పెట్టాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. దారుణమైన స్థితికి చేరాయని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. దోపిడిదారులు, గుండాలు, మాఫియా శక్తులన్నీ ఏకమై ఆంధ్రప్రదేశ్ ను ఆటవిక రాజ్యంగా మార్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల వారిపై గంపగుత్త దాడులే కాదు, విచ్చలవిడిగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం, రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులను కాలరాయడం ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీడియాపై వరుస దాడులు చేస్తున్నారని..తుని, నెల్లూరు, చీరాల తదితర ప్రాంతాల్లో జర్నలిస్ట్‌లపై దాడులు జరిగాయని లేఖలో ప్రస్తావించారు.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు పంచాయితీలో ఓ జర్నలిస్టు ఇంటిపై దాడి జరిగిందని.. ఈ దాడికి పాల్పడింది అధికార పార్టీ వైసిపికి చెందినవారు కాబట్టే వాళ్ల పాత్ర బైటకు రానివ్వకుండా పోలీసులే ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. దళిత వర్గానికి చెందిన ఎం నారాయణ, ఓం ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని అన్నారు. జర్నలిస్ట్‌లపై ఇటువంటి విచ్చలవిడి దాడులు కొనసాగితే, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యం ఉనికినే కోల్పోతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నానని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP DGP, Chandrababu naidu