Andhra Pradesh: గుడిలో అదృశ్యం.. కొలనులో లభ్యం.. ఆపచారానికి ఒడిగట్టిందెవరు..?

Andhra Pradesh: గుడిలో అదృశ్యం.. కొలనులో లభ్యం.. ఆపచారానికి ఒడిగట్టిందెవరు..?

కొలనులో లభ్యమైన శ్రీరాముని విగ్రహం శిరస్సు భాగం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయనగరం జిల్లా (Vizianagaram District) రామతీర్థం (Ramatheertha) ఆలయంపై దాడి ఘటనలో విచారణ కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామాలయంపై దుండగుల దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అర్ధరాత్రి ఆలయంలో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనలకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఐతే శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన శిరస్సు భాగాన్ని ఆలయంలోని రామకొలనులో గుర్తించారు. లోతైన కొలనులో ఉదయం నుంచి గాలింపు చేయగా.. 6 గంటల తర్వాత శ్రీరాముని శిరస్సు భాగాన్ని గుర్తించారు. అనంతరం జై శ్రీరాం నినాదాల మధ్య శిరస్సును ఆలయానికి చేర్చారు. చినజీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిథులతో శిరస్సు పునఃప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  అసలేం జరిగింది..?
  విజయనగరం జిల్లా పవిత్ర పుణ్య‌క్షేత్రం రామతీర్థంలోని కోదండ రామస్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్‌ రోజువారిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెనక ఎవరున్నారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.

  రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తీవ్రంగా స్పందించి ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. దేవదాయ శాఖ ఆర్‌జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. నిందితులను పట్టుకోవడం కోసం గాలింపు చేపడుతున్నట్టు ఎస్పీ రాజకుమారి తెలిపారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు.

  మరోవైపు రామతీర్థ క్షేత్రంలో రాముడి విగ్రహం ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ హయంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆలయాలకు రక్షణ కల్పించలేకపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై శ్రీ కోదండరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. విగ్రహం శిరస్సు కనిపించకుండా ధ్వంసం చేయడాన్ని చూసి చాలా బాధకలిగిందని పేర్కొన్నారు. ఇది మత మౌధ్యం తలెక్కిన ఉన్మాదపు చర్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అంతరవేది రథం దగ్ధం, దుర్గగుడిలో రథంపై సింహాల ప్రతిమల చోరీ ఘటనలు మరవకముందే రామతీర్థ ఆలయంపై దాడి చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఆలయాలపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
  Published by:Purna Chandra
  First published: