news18-telugu
Updated: July 15, 2020, 5:12 PM IST
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం అధికారికంగా సీఎస్ నేతృత్వంలో ఓ అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. ఒక్కో లోక్ సభ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం సూచించిన విధంగానే కమిటీ నివేదిక రూపొందిస్తే... ఏపీలో మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. అయితే ఏపీలోని ఆ ఒక్క లోక్ సభ నియోజకవర్గం విషయంలో మాత్రం జగన్ సర్కార్ రెండో ఆలోచన చేస్తోందనే వాదన వినిపిస్తోంది. అదే విశాఖలోని అరకు లోక్ సభ నియోజకవర్గం.
విస్తీర్ణం పరంగా అది పెద్ద లోక్ సభ నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకున్న అరకు పార్లమెంట్ స్థానం మొత్తం నాలుగు జిల్లాల్లో విస్తరించింది. నియోజకవర్గంలోని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో ఉండగా, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుండగా, రంపచోడవరం మాత్రం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉంది. ఇలా ఒక లోక్ సభ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం... అందులోనూ ఈ నియోజకవర్గంలో గిరిజన జనాభా ఎక్కువ ఉండటంతో అరకు జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అయితే అరకు జిల్లా అంశంపై కేబినెట్లోనే కొందరు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణంపై చర్చ జరగ్గా... అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధ్యయన కమిటీకి సూచించారని తెలుస్తోంది. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలని ఆయన చెప్పినట్టు సమాచారం. దీంతో మిగతా జిల్లాల ఏర్పాటు సంగతి ఎలా ఉన్నా... అరకు విషయంలో మాత్రం ప్రభుత్వం కాస్త భిన్నమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
July 15, 2020, 5:12 PM IST