ఇటీవల ఛార్జీలు పెంచి విమర్శల పాలవుతున్న ఏపీఎస్ఆర్టీసీ (APSRTC).. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. పెంచిన ఛార్జీలకు తగ్గట్లు బస్సుల్ల సౌకర్యాలను పెంచనుంది. అంతేకాదు డొక్కుబస్సుల నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగించేలా చర్యలు తీసుకోనుంది. పాతబడిన బస్సులతోనే నెట్టుకొస్తున్న దుస్థితికి ముగింపు పలికేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 11,271 బస్సులు ఉన్నాయి. వాటిలో దాదాపు 3,800 బస్సులు బాగా పాతబడ్డాయి. వీటితో ప్రయాణికులతో పాటు డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. ఏసీ బస్సులు 10 లక్షల కి.మీ., ఎక్స్‌ప్రెస్ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. సర్వీసును పూర్తి చేసినవి ఉన్నాయి. గత ప్రభుత్వం వివిధ కారణాలతో కొత్త బస్సులను ప్రవేశపెట్టలేదు. దీంతో పలుచోట్ల బస్సులు తరచూ బ్రేక్‌డౌన్ కావడం, మార్గమధ్యలో రిపేర్లు వస్తుండటంతో ప్రయాణికులు నరకం చూస్తున్న పరిస్థితి.
ఇక ఇలాంటి కష్టాలకు చెక్ పెడుతూ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా మూడంచెల విధానాన్నికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెట్టడం.. ప్రస్తుతం ఉన్న బస్సులను ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ ద్వారా పూర్తిగా అప్ గ్రేడ్ చేయడం, కాలుష్యరహితంగా దాదాపు 2 వేల డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది.
త్వరలో కొత్త బస్సులు
బస్సులను ఆధునీకరించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 998 బస్సులను అద్దె విధానంలో రొడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ చేపట్టి.. మే రెండోవారం నాటికి పూర్తి చేయాలని చూస్తోంది. ఇది పూర్తైతే జూలై చివరి నాటికి కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇక 1,150 బస్సులను ఫేస్ లిఫ్ట్ ప్రక్రియ పూర్తిగా రూపురేఖలు మార్చేస్తున్నారు. పాతసీట్ల స్థానంలో కొత్తసీట్లు వేయడం, కొత్తటైర్లు వేయడం, ఇతర అంశాలను కూడా పూర్తిగా మార్చేసి కొత్తగా తీర్చిదిద్దుతారు.
e-బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తి
కాలుష్యాన్ని తగ్గిస్తూ.. పర్యావరణ హితంగా ఉండేలా e-బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతో తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో 150 ఎలక్ట్రిట్ బస్సుల కోసం టెండర్లను పూర్తి చేసింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇందుకోసం డీజిల్ బస్సులను e-బస్సులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రెట్రోఫిట్‌మెంట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఒక డీజిల్ బస్సును ప్రయోగాత్మకంగా రెట్రో ఫిట్ చేసి e–బస్సుగా మార్చారు. త్వరలోనే ఆ బస్సును పుణెలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (సీఐఆర్‌టీ) పరిశీలనకు పంపుతారు. అక్కడ నిపుణుల ఆమోదం తెలిపిన తర్వాత వారు సూచించిన ప్రమాణాల మేరకు 2వేల డీజిల్ బస్సులను e-బస్సులుగా మారుస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Apsrtc