• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • AP TELANGANA WATER FIGHT TS CABINET SLAMS RAYALASEEMA LIFT IRRIGATION AND RDS ISSUE HERE IS CM KCR KEY DECISONS SK

RDS Fight: ఏపీ తీరుపై తెలంగాణ ఆగ్రహం.. కేబినెట్ సంచలన నిర్ణయాలు.. కొత్త ప్రాజెక్టులు ఇవే

కేసీఆర్, వైఎస్ జగన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (RDS) కుడి కాల్వ నిర్మాణాలను అక్రమంగా చేపడుతోందని తెలంగాణ కేబినెట్ మండిపడింది. ఏపీకి కౌంటర్‌గా పలు కొత్త ప్రాజెక్టులను కూడా ప్రకటించింది.

  • Share this:
    తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలజగడం ముందురుతోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ తీవ్రంగా స్పందించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (RDS) కుడి కాల్వ నిర్మాణాలను అక్రమంగా చేపడుతోందని తెలంగాణ కేబినెట్ మండిపడింది. ఏపీకి కౌంటర్‌గా పలు కొత్త ప్రాజెక్టులను కూడా ప్రకటించింది. ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్‌కు తెలిపింది. ఎన్‌జీటీతో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని కేబినెట్ తీవ్రంగా ఖంఢించింది. ఏపీ తీరు వల్ల తెలంగాణ తీరని అన్యాయం జరుగుతుందని వాపోయింది.

    తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల వలన.. పాలమూరు, నలగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు.. హైదరాబాద్ తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరగనుందని తెలిపింది. ఈ నేపథ్యంలలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    నీటిపారుదల రంగంపై కేబినెట్ నిర్ణయాలు:

    జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద.. గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో.. బారేజీ (జోగులాంబ)ని నిర్మించి 60-70 టిఎంసీల వరద నీటిని పైపు లైను ద్వారా తరలించాలని నిర్ణయించింది. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమయిన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణయించింది.

    పులిచింతల ఎడమ కాల్వను నిర్మాణం చేసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరొక ఎత్తిపోథల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతానికి మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించింది. కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతమైన కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద.. భీమా వరద కాల్వను నిర్మించాలని నిర్ణయించింది.

    కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల నిల్వ సామర్ధ్యాన్ని 20 టిఎంసీలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు, సాగునీటి సౌకర్యం కల్పించాలి. ఈ ప్రాజెక్టులకు సర్వేలు నిర్వహించి, డిపీఆర్‌ల తయారీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సాగునీటి శాఖను కేబినెట్ ఆదేశించింది.

    వానాకాలం లోనే నదీ జలాల లభ్యత ఎక్కువగా వుండడం చేత జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుకూలత ఏర్పడుతుందని కేబినెట్ చర్చించింది. ప్రారంభంలోనే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు నీటి ప్రవాహం పెరుగుతుంది కాబట్టి.. తెలంగాణకు హక్కుగా ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా విద్యుత్తును వానాకాలం సీజన్ లోనే వీలయినంత సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసి ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలని నిర్ణయించింది.

    కృష్ణా గోదావరి నదుల పై 2375 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిన ప్రాజెక్టులున్నాయి. వాటి సంపూర్ణ సామర్ధ్యంతో జల విద్యుత్తును ఉత్పత్తి చేసి, రాష్ట్రంలోని కాళేశ్వరం, దేవాదుల, ఎఎంఆర్పీ తదితర లిప్టు ఇరిగేషన్ పథకాలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది.

    తెలంగాణకు కృష్ణా జలాలపై హక్కులను పరిరక్షించుకొని తెలంగాణ రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణ నిర్ణయించింది. ఈ విషయంలో ప్రధాన మంత్రిని, కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించి, ఈ అక్రమ ప్రాజెక్టులను ఆపించే విధంగా చూడాలని.. ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో, ఆంద్ర ప్రదేశ్ జల దోపిడీని ఎత్తిచూపి, రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పి., జాతికి వివరించాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్ర ప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల పర్యవసానంగా కృష్ణా బేసిన్ ప్రాంతాలకు సాగునీటి రంగంలో జరిగబోయే తీవ్ర నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది.


    బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడి 17 ఏళ్లయినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా.. తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన నీటివాటా నిర్దారణ కాలేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం- 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయమని విజ్జప్తి చేసింది. అయితే సుప్రీం కోర్టులో కేసు కారణంగా తాము సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయలేకపోతున్నామని, తెలంగాణ కేసులను విరమిస్తే గనుక తాము త్వరగా నిర్ణయిస్తామని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అపెక్స్ కౌన్సిల్ రెండవ సమావేశం స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించనందున.. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలుగుతోందని తెలంగాణ కేబినెట్ అభిప్రాయపడింది. కొత్త ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రం కుదురుకోవడానికి కేంద్రం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టి నూతన రాష్ట్రానికి సహకారం అందించాల్సి ఉంటుందని మంత్రివర్గం తెలిపింది. కానీ అటువంటి చొరవ తీసుకోకుండా, బాధ్యత వహించకుండా నదీ జలాల విషయంలో అవలంబిస్తున్న, కేంద్ర నిర్లక్ష్య వైఖరి పట్ల ఆవేదన వ్యక్తం చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published: