పదవ తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జులైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జులై పరీక్షల నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని.. త్వరలోనే షెడ్యూల్ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఎక్కువ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ మంత్రి. అంతేకాదు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని.. పరీక్ష పూర్తయ్యాక ప్రతి గదినీ శానిటైజ్ చేస్తామని చెప్పారు ఆదిమూలపు సురేష్.
ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్వహించి తీరుతామని గతంలోనే స్పష్టం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు జరిగే వరకు ఆన్లైన్లో సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు వినాలని విద్యార్థులకు సూచించారు మంత్రి సురేష్. విద్యార్థులు ఇంటి వద్దే ఉండి సప్తగిరి ఛానల్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 4 గంటలనుంచి 5 గంటల వరకు రోజుకు రెండు గంటల పాటు పాఠాలను వినాలని చెప్పారు. పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి? సబ్జెక్టులను ఎలా అర్థం చేసుకోవాలి? తదితర అంశాలను విద్యామృతం అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తెలియజేస్తున్నట్లు ఇది వరకే వివరించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.