రాష్ట్రపతి ఎన్నికల (President Elections) విషయంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో మద్దతుపై సస్పెన్స్ కు తెరదించుతూ ఎవరికి మద్దతిచ్చేదీ తేల్చిచెప్పేసింది. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ (BJP) కే మద్దతిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన వ్యక్తికి అందులోనూ మహిళకు ఇవ్వడం శుభపరిణామమని వైసీపీ పేర్కొంది. అందుకే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపది ముర్మూ (Draupadi Murmu)కు మద్దతిస్తున్నట్లు స్పష్టంచేసింది. గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్ద పీట వేస్తున్న పార్టీగా... ద్రౌపది ముర్మూకి మద్దతు తెలుపుతున్నామన్నామని పేర్కొంది.
ఐతే ద్రౌపది ముర్మూ నామినేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ స్వయంగా హాజరవుతారన్న ప్రచారం జరిగినా.. ఆయన వెళ్లడం లేదని తెలిసింది. నామినేషన్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో విపక్షాల అభ్యర్థికి వైసీపీ మద్దతిస్తుందన్న ప్రచారం జరిగినా వైసీపీ మాత్రం ఆ నిర్ణయం తీసుకోలేదు. దీంతో సీఎం జగన్.. విపక్షాలకు షాకిచ్చినట్లయింది.
ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలంటే ప్రత్యేక హోదా డిమాండ్ ను సీఎం జగన్ లేవనెత్తుతారని.. డిమాండ్లు సాధించుకునేందుకు ఇదే సరైన సమయం కాబట్టి ఎన్నికల్లో ప్రత్యేక హోదాకు లింక్ పెడతారన్న ప్రచారం జరిగింది. ఐతే ఎలాంటి పొలిటికల్ ట్విస్టులకు చోటివ్వని జగన్.., బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఐతే సామాజిక న్యాయం కోణంలోనే బీజేపికి మద్దతిస్తున్నామని ప్రకటించిన జగన్ ఒకింత సేఫ్ గేమ్ ఆడారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన వైసీపీ మద్దతు కూడగట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఓవైపు ఏపీలో ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ, బీజేపీ పోటీపడ్డాయి. పోలింగ్ రోజున రెండు పార్టీల నేతలమధ్య గొడవలు కూడా జరిగాయి. అదే రోజు వైసీపీ.. బీజేపీకి మద్దతు పలకడం ఆసక్తిని రేకెత్తించింది.
ఇదిలా ఉంటే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. ఆమె నామినేషన్ సందర్భంగా బీజేపీతో పాటు ఎన్డీయేపక్ష ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్మూ.. ఓ గిరిజన మహిళ.. గతంలో టీచర్ గా పనిచేసిన ఆమె.. ఝార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గిరిజన మహిళ రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.