పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందులలోని వేంపల్లె గ్రామ పంచాయతీ నామినేషన్ల సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. వేంపల్లెలోని 11వ వార్డుకు రవికుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నామినేషన్ వేసేందుకు పంచాయతీ కార్యాలయానికి వెళ్లాడు. దీంతో అతడ్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. భయంతో రవికుమార్ వెనుదిరగడంతో అతడ్ని వెంటబెట్టుకొని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసీరెడ్డి పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే అక్కడకు భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తులు తులసీరెడ్డితో పాటు రవికుమార్ ను కూడా అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
పంచాయతీ అధికారులిచ్చిన సమచారంతో హుటాహుటిన పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. రెండు పార్టీల నేతలకు పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల దాడులు జరుగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కడప, కర్నూలు, చిత్తూరుతో పాటు గుంటూరు జిల్లాలో రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
ఐతే వేంపల్లె ఘటనలో వైసీపీ నేతలు ఏకగ్రీవానికి యత్నించే క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వేంపల్లె పంచాయతీని ఏకగ్రీవం చేయాలని అధికార పార్టీ మద్దతుదారులు భావించగా.. కాంగ్రెస్ సానుభూతిపరులు నామినేషన్ కు సిద్ధమయ్యారు. దీంతో రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారీతిసినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP Congress, Attack, Kadapa, Pulivendula, Ysrcp