వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులిచ్చి.. అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రఘురారామ కృష్ణంరాజు ఇంటికి చేరుకున్న సీఐడీ అధికారుల బృందం... ఆయనకు నోటీసులిచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఐతే వై కేటగిరీ భద్రత కలిగిన ఆయన్ను అరెస్ట్ చేసేందుకు యత్నించిన సీఐడీ అధికారులను సీఆర్పీఎఫ్ జవానులు అడ్డుకున్నారు. ఐతే సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఐడీ అధికారులు.. రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం ఆయన ఇంటికి నోటీసులు కూడా అంటించారు.
ఐతే ఆయన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదని.. 35 మంది దౌర్జన్యం ఇంట్లోకి ప్రవేశించి అరెస్ట్ చేశారని.. రఘురామ కృష్ణంరాజు కుమారుడు భరత్ తెలిపారు. వారెంట్ కూడా ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. నాలుగు నెలల క్రితం తన తండ్రికి బైపాస్ సర్జరీ జరిగిందని.. ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారని.. కుటుంబ సభ్యులను కూడా పక్కకు నెట్టేసి బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారన్నారు. వచ్చిన వాళ్లు సీఐడీ పోలీసులో కాదో తమకు అనుమానంగా ఉందన్నారు.
మరోవైపు నర్సాపురం నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా విజయం సాధించిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు.. గత కొంతకాలంగా ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్, ఇతర ముఖ్యనేతలపై విమర్శలు చేస్తున్నారు. ప్రతి రోజూ రాజధాని రచ్చబండ పేరుతో మీడియా సమావేశం నిర్వహిస్తూ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. మూడు రాజధానులు, ఇసుక పాలసీ, మద్యపాన నిషేధం, కరోనా నియంత్రణ, ప్రభుత్వ సలహాదారులు ఇలా అన్ని అంశాల్లో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ప్రాణానికి హాని ఉందని.., కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని లోక్ సభ స్పీకర్, ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దీంతో ఆయనకు కేంద్రం వై కేటగిరీ భద్రతను కేటాయించింది. ఐతే కేంద్ర బలగాలతో భద్రత కేటాయించినప్పటికీ ఆయన ఇటు ఏపీకి గానీ.., అటు హైదరాబాద్ కి గానీ రావడం లేదు. శుక్రవారం తన పుట్టినరోజు కావడంతో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ నివాసానికి వచ్చారు. విషయం తెలుసుకున్నఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ వెళ్లి రఘురామ కృష్ణం రాజును అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.