మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని అన్నారు. మైలవరం వైసీపీలో అంతర్గత పోరు నిజమే అని వ్యాఖ్యానించారు. మైలవరంలో పార్టీ పరిస్థితిపై త్వరలో అధిష్టానాన్ని కలుస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ పోటీ చేయమని కోరితే పోటీ చేస్తానని.. లేదంటే లేదని అన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటానని వసంత కృష్ణప్రసాద్ (Vasanta Krishna Prasad) చెప్పుకొచ్చారు. అంతకుముందు వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావుపై (Vasanta Nageshwara Rao) చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. కమ్మ వర్గానికి సిఎం జగన్ అన్యాయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని(Vijayawada) ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. జగ్గయ్యపేటలో కాకతీయ సేవా సమితి నిర్వహించిన వన సమారాధనలో పాల్గొన్న ఆయన రాష్ట్ర రాజకీయాల పైన స్పందించారు. ఏపీ కేబినెట్ లో కమ్మ వర్గానికి చెందిన మంత్రి లేకపోవటం ఏంటని ప్రశ్నించారు.
గుంటూరు-విజయవాడ మధ్య అమరావతి రాజధానిగా ఉండటం హర్షణీయమని, రాష్ట్రాభివృద్ధికి చిహ్నమని వసంత అభిప్రాయపడ్డారు. ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు. రూపాయి తీసుకోకుండా రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల నుంచి 32 వేల ఎకరాల భూములు ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని కోసం రైతులు తమ భూముల్ని త్యాగం చేశారని చెప్పారు. విజయవాడలో రైల్వే జంక్షన్, విమానాశ్రయం, కృష్ణా నదిలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ పేర్లతో అనేక నిర్మాణాలు ఉన్నాయని, కానీ, ఏ ప్రభుత్వం వారి పేర్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు.
రాష్ట్రంలో కమ్మ వర్గం పైన రాజకీయంగా దాడి చేస్తున్నా ఎందుకు స్పందించటం లేదో అర్దం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు కలిగిన సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాల వారి పల్లకీలు ఇంకెంత కాలం మోస్తారని వ్యాఖ్యానించారు. పరిస్థితులు మారితేనే భవిష్యత్ తరాలు రాజకీయాల్లోకి వస్తాయని చెప్పుకొచ్చారు. ఏపీలో కంటే పక్క రాష్ట్ర అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.
AP Politics: చంద్రబాబు , లోకేష్ లు ఎందుకు.. దమ్ముంటే కొడాలి నాని తనతో పోటీ పడాలంటూ.. టీడీపీ నేత సవాల్..
AP BJP: ఏపీలో బీజేపీకి అదే మైనస్సా.. పార్టీ బలపడకపోవడానికి కారణం ఎవరు..?
కమ్మ సామాజిక వర్గంపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కమ్మ సంఘం సమావేశాల్లో సీనియర్ అయిన వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదన్నారు. గత టిడిపి హయంలో మైనార్టీ , ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని... ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని కొడాలి నాని పేర్కొన్నారు. ఒక్క కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఇవ్వలేదనడం సరికాదని అన్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకత్వం సీరియస్గా ఉండటంతో.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Ysrcp