Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఎమ్మెల్యేలకు కూడా సరైనా గౌరవం దక్కడం లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి సామాన్య భక్తులకు అధిక ప్రాధ్యానత కల్పిస్తూ తిరుమలేశుని దర్శనంలో అనేక మార్పులు చేర్పులు చేసారు.. అయితే సామాన్య భక్తులను ప్రక్కన పెట్టి వీఐపీలు, వీవీఐపీల బ్రేక్ దర్శనాలతో అధికారులు తరించిపోతున్నారనేది ప్రస్తుతం అందరిలోనూ వినిపిస్తున్న మాట.. చివరకు ఎమ్మెల్యేలకు కూడా స్వామి వారి దర్శన భాగ్యం కలగడం లేదని సాక్షాత్తు శ్రీనివాసుడి ఆలయం ముందే వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలు కురిపించడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో టిటిడి అధికారుల తీరుపై సామాన్య భక్తుల నుండే కాకుండా, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసే అనేక మంది విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షం నుంచి విమర్శలు రావడం సహజం అయితే స్వపక్షం నుంచే తీవ్ర విమర్శలు రావడంతో సీఎం జగన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. టిటిడి ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి జగన్ రెడ్డి తలంటినట్టు తెలుస్తోంది.
ప్రజాప్రతినిధులకు విలువే లేదా..?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు తీసుకుని వెళుతుంటారు. ప్రస్తుతం అలాంటి సిఫార్సు లేఖలకు అంత విలువ పెద్దగా లేదనే చెప్పొచ్చు.. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల దర్శనానికే అధికారులు అడ్డంకులు పెడుతుంటే నేపథ్యంలో వారి సిపార్సు లేఖలకు ఎలాంటి విలువ ఉంటుందో ఇలానే అర్ధం చేసుకోవచ్చు.. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరుమల స్వామి దర్శనానికి వెళ్లారు.. అయితే కనీసం ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అధికారులు ప్రవర్తించిన తీరుపై ఆయన శ్రీవారి ఆలయం ముందే మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈవో థర్మారెడ్డి కనీసం ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు.. దీంతో ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందనే చెప్పొచ్చు.. దీనిపై అధికార పార్టీలో నాయకులు సైతం చెవులు కొరుకుంటున్నారని తెలుస్తొంది.
ప్రజాప్రతినిధులను పట్టించుకోండి మహా ప్రభు..?
వైసీపి అధికారం లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకూ సామాన్య భక్తులు ఆ దేవదేవుడిని దూరం చేసారనే విమర్శలు లెక్కకు మించి వినిపిస్తుంది. ఎలాగో సామాన్యులను పట్టించుకోవడం లేదు. డబ్బు ఉన్న వారికే శ్రీనివాసుడి దర్శనం అన్నట్లుగా ఎంత ఎక్కువ ఖర్చు చేయగలిగితే అంత త్వరగా స్వామి వారిదర్శనం దక్కుతుందనే మాటలు శ్రీవారి భక్తులు ప్రస్తుతం వినిపిస్తుంది. అయితే కనీసం ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను ఐనా పట్టించుకోవాలని అధికార పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తుంటే.., టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.. తిరుమల స్వామి వారి దర్శనం విషయంలో ఎంపీలు, ఎమ్మెలకే కాదు, వారు సిఫార్సు చేసిన వారికి కూడా ఎల్ వన్ దర్శనాలు చేయించాల్సి ఉంటుంది. ప్రస్తుత అధికారుల పాలనలో ఎమ్మెల్యేలకే దిక్కు లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రాధాన్యత ఇస్తూ దర్శన టోకెన్లు జారీ చేసే వారు. ఇక సామాన్య భక్తులకు సైతం సరైన సౌఖర్యాలు కల్పించడం లేదంటూ పెద్ద ఎత్తున దుమారం రేపుతుండడం శ్రీవారి భక్తులంతా తిరుమల కొండ వైపు చూడాల్సిన పరిస్ధితి నెలకొంది.
ఇకనైనా తీరు మారుతుందా..?
టిటిడిలో జరుగుతున్న పరిణామాలపై, దర్శన విధి విధానాలపై టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సీఎం జగన్ రెడ్డి పిలిపించి, టిటిడి ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, తిరుమల దర్శనాల విషయంలో విమర్శలు రావడంపై కూడా చర్చించినట్టు సమాచారం అందుతోంది.. ఇకనైనా సామాన్య భక్తులకు సకాలంలో స్వామి వారి దర్శన భాగ్యం కలిగేలా చూడాలని కోరుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ttd