Anna Raghu, News18, Amaravati
వైసీపీ (YSRCP) లో రోజుకో నేత చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నియోజకవర్గస్థాయి ప్లీనరీల సందర్భంగా ఎమ్మెల్యేలు సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా (Prakasham District) కు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు (Nellore) రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడంతో పార్టీలో అంతర్గత విబేధాలున్నాయన్నది స్పష్టమైంది. ఐతే ఆ ఇద్దరు నేతలు పార్టీలో పరిస్థితిపై వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే ప్రభుత్వ తీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల బిల్లులుపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రకాశం జిల్లా వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా డబ్బులు జమచేయడం వల్ల ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరడగడం లేదంటూ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అంతేకాదు తన కార్యకర్తలు అప్పులపాలయ్యారని వారిని ఆదుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని అన్నారు. తన నియోజకవర్గంలో పనులన్నీ వైసీపీ కార్యకర్తలకే అప్పగించానని.. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయదపోవడంతో వారంతా అప్పులపాలయ్యారని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఆదుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు.
దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి కార్యకర్తలకు రావాల్సిన పేరుకుపోయిన బిల్లులు మంజూరు చేయాలని మద్దిశెట్టి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కార్యకర్తల్లో బయటకి కనిపిస్తున్న ఆనందం.. వారి జీవితాల్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు గడపగడపకు వెళ్తే ప్రజలు సమస్యలపై నిలదీస్తున్నారన్నారు.
జిల్లా ప్లీనరీలో ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్ చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. దీన్నిబట్టి చూస్తే సొంతపార్టీ నేతలే వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారని.. ప్రభుత్వం అధికారంలో ఉన్నా బిల్లులు విడుదల కాకపోవడంపై రగిలిపోతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే వైసీపీలో పరిణామాలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో కొందరు ముఖ్యనేతలు తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పక్క నియోజకవర్గానికి చెందిన వారు తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని.. వారు వెనక్కి తగ్గితే మంచిదని లేదంటే బుద్ధి చెబుతానని హెచ్చరించారు. అంతేకాదు తన నియోజకవర్గంపై చూపే శ్రద్ధ మీ సొంత నియోజకవర్గాలపై చూపుకోవాలని హితవుపలికారు. ఇక ప్రకాశం జిల్లాకే చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా.. పార్టీలో తనపై కుట్రలు చేస్తున్నారని కామెంట్ చేశారు. వైసీపీలో ఎమ్మెల్యేలు తరచూ ఇలాంటి కామెంట్స్ చేయడం ప్లీనరీ ముందు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Prakasham dist, Ysrcp