ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైసీపీ (YSRCP) లో సీనియర్ నేతల కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం (Prakasham District), నెల్లూరు జిల్లా (Nellore District) లకు చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించగా.. ఇప్పుడు బాలినేని కామెంట్స్ పై మరో సీనియర్ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ నెల్లూరు జిల్లా వైసీపీలో దుమారం రేపుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తనను నన్ను బలహీనం చేయాలని కుట్ర చేస్తున్నారంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఎప్పుడు.. ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇతర నియోజకవర్గ నేతలు నా నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని విమర్శించారాయన. ఇకపై వారి ఆటలు సాగనీయనని.. వారిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసని హాట్ కామెంట్స్ చేశారు.
ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ముఖ్య నేతలకు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవాల్సిన పని ఏంటని కోటంరెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేశానని.., నిత్యంలో జనంలో ఉన్న నన్ను వారు ఏమీ చేయలేరని ఆయన అన్నారు. అంతేకాదు నా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీలో ఉంటున్న ఈ నేతలు రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదని.., నా నియోజకవర్గంలో వేలు పెట్టే సమయాన్ని వారి సొంత నియోజకవర్గంలో పరిస్థితులు చక్కదిద్దుకుంటే చాలని హితవు పలికారు. వైసీపీలో ఉంటూ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్న నేతలను ఇప్పటివరకూ సహిస్తూ వస్తున్నాని.. ఇకపై పద్ధతి మార్చుకోకుంటే నేను కూడా మీ నియోజకవర్గంలో వేలు పెడతా లేదంటే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని.. తనకు రెండు ఆప్షన్లు ఉన్నాయని శ్రీధర్ రెడ్డి అన్నారు.
అంతేకాదు తనపై పార్టీలోనే కుట్రలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ పైనా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లాలో బాలినేని అంటే వైసీపీ.. వైసీపీ అంటే బాలినేని అని.. ఆయనపై సొంతపార్టీ నేతలే కుట్రలు చేయడం బాధాకరమన్నారు. అలాగే బాలినేనిపై టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావన్నారు. ఆయన హుందాకలిగిన నేత అని.. అందర్నీ కలుపుకుపోయే వ్యక్తిత్వమున్నవారన్నారు. మొత్తానికి ఒకేరోజు ఇద్దరు సీనియర్ నేతల వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ ఇద్దరు నేతలపై కుట్రలు చేస్తున్నవాళ్లెవరు..? పక్క నియోజకవర్గాల్లో వేళ్లు పెడుతున్న ముఖ్యనేతలెవరనేదానిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kotamreddy sridhar reddy, Nellore Dist, Ysrcp