P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18
ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ.వందకోట్ల విలువైన భూమి. యజమానులు అమెరికాలో ఉంటున్నారు. అంతే కొందరు అక్రమార్కుల కన్ను ఆ భూమిపై పడింది. ఇంకేముంది అడిగేవాడు లేడనుకున్నారో ఏమో.. డాక్యుమెంట్స్ పోయాయని.. పేపర్లో యాడ్ ఇచ్చారు. అభ్యంతరాలకు డెడ్ లైన్ పెట్టారు. గడువు పూర్తవక ముందే రిజిస్ట్రేషన్ కు ముహూర్తం పెట్టారు. కట్ చేస్తే ల్యాండ్ ఓనర్స్ ఎంట్రీ ఇచ్చారు. ఆ భూమి తమదేనని అధికారులను, పోలీసులను ఆశ్రయించారు. దీంతో ల్యాండ్ కొట్టేయడానికి వేసిన స్కెచ్ బయటపడింది. ఇందులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు హస్తముండటంతో రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు వస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా కొమ్మాదిలో రూ.100 కోట్ల విలువైన భూమిని కారు చౌకగా దక్కించుకునేందుకు ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రయత్నించారన్న ఆరోపణలు జిల్లా వైసీపీని షేక్ చేస్తున్నాయి.
కొమ్మాదిలోని 12.26 ఎకరాల భూమికి భూమికి ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవని, పోయాయని, పత్రిక ప్రకటన ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చునని దళారులు చెప్పగానే, లాభసాటి బేరం వచ్చిందనుకున్నారు ఎమ్మెల్యే. డాక్యుమెంట్లు లేవు కాబట్టి, ఆ పరంగా వచ్చే ఇబ్బందులు తాను చూసుకుంటానని, తక్కువ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 12.26 ఎకరాల భూమిని కేవలం రూ.18.7 కోట్లకే దక్కించుకుందామని అనుకున్నారు. కరోనా రాక ముందు 2020లో ఈ డీల్ కుదరగా, కోటి రూపాయల అడ్వాన్స్ తో ఆ పార్టీ మరో దగ్గరకు వెళ్లకుండా కట్టడి చేశారు.
విలువ పెంచకుండా ఒత్తిడి...
2020 ఆగస్టులో భూముల విలువలు పెంచడానికి రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేసినప్పుడు.., ఆ శాఖ అధికారులను కలిసి కొమ్మాదిలో భూముల విలువలు పెంచవద్దని కోరారు. ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్నదని, పెంచకపోతే ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పినా వినిపించుకోలేదు. తాను అక్కడ పెద్ద మొత్తంలో భూమి కొంటున్నానని, రేట్లు పెరిగితే ఎక్కువ మొత్తం ఫీజులు చెల్లించాల్సి వస్తుందని.. పెంచవద్దని తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెట్టారు. దాంతో అధికారులు మధ్యేమార్గంగా ఓ సూచన చేశారు. తమ పద్ధతి ప్రకారం అక్కడి రేట్ల ప్రకారం పెంచుతామని, నిర్ణయం ప్రభుత్వానిదేనని చెప్పారు. రిజిసే్ట్రషన్ సమయంలో 47-ఏ సెక్షన్ ప్రకారం మార్కెట్ రేటు తగ్గించాల్సిందిగా దరఖాస్తు చేసుకుంటే.., పరిశీలించి ఉన్నతాధికారుల సూచన మేరకు ఏమైనా చేయగలుగుతామని పేర్కొన్నారు. దాంతో ఆయన అప్పటికి వెనక్కి తగ్గారు.
కొమ్మాదిలో భూమిని తాము కొంటున్నామని ఎవరికైనా అభ్యంతరాలు వుంటే వారం రోజుల్లో చెప్పాలని కన్నబాబురాజు కుటుంబం గత నెలలో పత్రికా ప్రకటన ఇచ్చింది. అందులో పేర్కొన్న గడువు ముగియకముందే మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆగస్టు నెల 26న భూమి రిజిస్ర్టేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. దీనిపై అదే నెల 25న భూమి యజమాని అయిన కృష్ణ చౌదరి భార్య ప్రసన్న తరపు లాయర్ ఫోన్ చేసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కన్నబాబు అండ్ కో పట్టించుకోలేదు. ఆ మరుసటిరోజునే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలనుకున్నారు. ఈ విషయాన్ని కూడా బాధిత కుటుంబం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది.
కొమ్మాదిలో భూముల ధరలు చాలా ఎక్కువ. ఎకరా ఎలా లేదన్నా రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే 12.26 ఎకరాల భూమి ధర రూ.100 కోట్లపైనే పలుకుతుంది. కానీ అక్కడ ప్రభుత్వ రిజిస్ర్టేషన్ ధర రూ.2.2 కోట్లు మాత్రమే ఉంది. అది కూడా ఎక్కువ ధర అని, తమకు రూ.1.53 కోట్లకే రిజిస్టర్ చేయాలంటూ... ఆ లెక్క ప్రకారమే ఆయన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించారు. సెక్షన్ 47-ఏ ప్రకారం తనకు ఆ రేటునే ఫిక్స్ చేయాలంటూ జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారం రెగ్యులర్ వాటికి భిన్నంగా వుండడంతో అధికారులు ఓ నంబరు వేసి పెండింగ్‌లో పెట్టారు. దీన్ని క్లియర్ చేసే విషయంలో ఒత్తిళ్లు తెచ్చినట్టు సమాచారం.
ఈ ల్యాండ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవడంతో ఎమ్మెల్యే కన్నబాబురాజు పాత్రపై ముఖ్యమంత్రి పేషీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. భూమిని విక్రయించడానికి యత్నించిన వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. అమెరికాలో వుంటున్న మరొక నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ వివాదం సీఎం పేషీ వరకు వెళ్లడంతో సంబంధిత అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Land scam, Visakhapatnam, Ysrcp