Anna Raghu, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఆ జిల్లా రాజకీయంగా చైతన్యం గల జిల్లా. అక్కడి ఓటర్లు రాజకీయాలపై పూర్తి అవగాహనతో ప్రభుత్వాలను ఎన్నుకుంటారన్న పేరుంది. అలాగే ఏ పార్టీకి కంప్లీట్ ఎడ్జ్ ఇవ్వరు. అదే ఉమ్మడి కృష్ణాజిల్లా (Krishna District). ఉమ్మడి కృష్ణ జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లకు గానూ.. వైసీపీకి ఏకంగా 14 సీట్లు వచ్చాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. జగన్ కు జై కొట్టడంతో అధికార పార్టీ సంఖ్య 15కు చేరింది. జిల్లాలో అంత స్ట్రాంగ్ గా ఉన్నామనుకున్న వైసీపీకి వర్గపోరు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏకంగా పార్టీ అధ్యక్షుడే జోక్యం చేసుకున్నా పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గాల్లో లుకలుకలు చెవులో జోరిగలా మారాయి.
కృష్ణా జిల్లా కేంద్రం బందరులో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మూడేళ్లుగా చాపకింద నీరులా ఉన్న విభేదాలు.., ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఎంపీ బాలశౌరి బందరులో పర్యటించేందుకు సిద్ధమవడం.. ఆయన్ను మాజీ మంత్రి పేర్ని నాని వర్గీయులు అడ్డుకోవడంతో బందరు వైసీపీలో బాంబు పడినంత పనైంది. దీంతో ఎంపీ అయిన తనను అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ.. పేర్ని నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బాలశౌరి. సొంత పార్టీ ఎంపీని.. ఎమ్మెల్యే వర్గం అడ్డుకోవం చర్చనీయాంశమైంది. అంతేకాదు పేర్నినాని.. టీడీపీ, బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారంటూ ఎంపీ ఆరోపించడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే జిల్లాలో మరో కీలక నియోజకవర్గమైన గన్నవరంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతు తెలపడంతో అప్పటికే పార్టీలో ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ విబేధాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వల్లభనేని వంశీ వ్యాఖ్యలకు దుట్ట రామచంద్ర, యార్లగడ్డ ఇద్దరూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వల్లభనేని లాగా సంస్కారం లేకుండా తాము మాట్లాడలేం అని యార్లగడ్డ అంటే.. వంశీకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే సపోర్ట్ చేసేది లేదంటూ దుట్టా చెప్పారు. దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి తాను పుట్టింది రాయలసీమలోనే అంటూ వార్నింగ్ ఇవ్వడం నియోజకవర్గంలో రాజకీయ వేడి ఏస్థాయిలో ఉందో అర్ధమవుతోంది.
ఇదిలా ఉంటే మైలవరం నియోజకవర్గంలోనూ వైసీపీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ మంత్రి జోగి రమేష్ వర్గం, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వర్గం ఉన్నాయి. రెండు గ్రూపులకు రాజకీయంగా పడటం లేదు. అలాగే కొండపల్లి మున్సిపాల్టీ కీవసం చేసుకున్న టీడీపీ జోష్ కు వైసీపీ బ్రేక్ లు వేయలేకపోతోంది. స్థానిక ఎమ్మెల్యే సరిగా అందుబాటులో లేకపోవటంతో నియోజకవర్గంలో పార్టీ గాడి తప్పింది. మొన్న జరిగిన ఎమ్మెల్యే ల పనితీరుపై సీఎం జగన్ చేయించిన సర్వేలో మైలవరం జీరోగా నిలిచింది.
విజయవాడ వెస్ట్ లో తాజా మాజీ మంత్రి వెలంపల్లిపై కొంతమంది వైసీపీ నాయుకులు కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేసి మంత్రి కి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసారి మాజీ మంత్రికి సితు కేటాయిస్తే మేము సహకరించమని బాహాటంగానే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారంటే పార్టీలో ని అంతర్గత కుమ్ములాటలు ఈమేరకు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna District, Ysrcp