ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పలుచోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సత్తెనపల్లిలోని పోలింగ్ బూత్ వద్దకు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు రావడంతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ వద్దకు కారు రావడాన్ని వ్యతిరేకించిన కార్యకర్తలు..వైవీ కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తీవ్రఉద్రిక్తతల నడుమ ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. పోలీసులు రంగప్రవేశె చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఉదయం నుంచి సత్తెనపల్లిలో వైసీపీ, టీడీపీల మధ్య కొట్లాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల భద్రతను పెంచారు.
సత్తెనపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉషారాణి భర్త నాగేశ్వరరావుపై జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లిలోని ఏడవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉషారాణితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చిన నాగేశ్వరరావును జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు తమపై దాడి చేశారని ఉషారాణి ఆరోపించారు. మరోవైపు అక్రమంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా అడ్డుకున్నామని.. ఆతర్వాత మాటామాట పెరిగిందని జనసేన నేతలంటున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. పోలింగ్ కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లా ప్రోద్దుటూరు పట్టణం 5వ వార్డులోని అరవిందాశ్రమం పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఆ పార్టీ కార్యకర్త ప్రచారం చేస్తుండగా టీడీపీ నేతలు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అలాగే మైదుకూరులోని 10వ వార్డు టీడీపీ జనరల్ ఏజెంటుగా ఉన్నముత్తూరు వెంకట సుబ్బారెడ్డిని పోలింగ్ బూత్ వద్ద డీఎస్పీ అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
అటు శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని 17వార్డులో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ నిర్వహించారు. ఇరువర్గాలను అదుపుచేశారు. అధికార పార్టీకి చెందిన ఏజెంట్లు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో మొదలైన వాగ్వాదం.. కొట్లాటకు దారితీసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap local body elections, Municipal Elections