వైసీపీ ప్లీనరీ (YSRCP Plenary) లో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ (YS Vijayamma) సంచలన ప్రకటన చేశారు. పార్టీ నేతలను, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురిచేస్తూ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై ఆమె తెలంగాణ (Telangana) లో వైఎస్ షర్మిలకు తోడుగా ఉంటానని.. అందువల్ల వైసీపీ (YSRCP) లో కొనసాగలేనని తెలిపారు. ప్లీనరీలో గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ (CM YS Jagan) , షర్మిల (YS Sharmila) మధ్య విబేధాలంటూ వస్తున్న ప్రచారంపై విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. తన అన్నకు ఎలాంటి కష్టం కలగకుండా ఉండాలనే షర్మిల.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారని విజయమ్మ స్పష్టతనిచ్చారు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందన్నారు. ఈ సమయంలో షర్మిలకు తోడుగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.
వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్టీపీలోనూ సభ్యత్వం ఉండాలా వద్దా అనేదానిపై చాలా ఆలోచించానన్నారు. ఇద్దరికీ తల్లినే కాబట్టి.. ఇద్దరి భవిష్యత్తు కోసం చేతనైన సహకారం అందించానన్నారు. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగేది ఒకఎత్తు అన్న విజయమ్మ. ఏపీ కంటే తెలంగాణలో ముందుకా ఎన్నికలు వస్తున్నందున.. ఆ రాష్ట్ర ప్రయోజనాల గురించి షర్మిల మాట్లాడుతుందన్నారు. జగన్ కూడా ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఇప్పుడొచ్చిన పరిస్థితి కేవలం దేవుడే నడిపిస్తున్నాడని తాను నమ్ముతున్నట్లు విజయమ్మ అభిప్రాయపడ్డారు.
రెండు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో వక్రీకరణలకు, బురదజల్లే రాజకీయాలకు తావులేకుండా ఉండాలని ఆమె అన్నారు. ప్రస్తుతం జగన్ మంచి సీఎంగా ముందుకెళ్తున్నారని.. జగన్ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకముందన్నారు. ఈ పరిస్థితుల్లో తానపై వచ్చే విమర్శలకు తావులేకుండా ఉండాలన్న ఉద్దేశంతో తాను గౌరవాధ్యక్షురాలిగా వైసీపీలో కొనసాగడం సరికాదన్న నిర్ణయానికి వచ్చానన్నారు.
ఇది చదవండి: నేడు ఏపీ రైతు దినోత్సవం.. అన్నదాతలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలివే..!
ఈ పరిస్థితిపై కొంతమంది రకరకాలుగా రాస్తున్నారని.. పిచ్చిరాతలు రాస్తున్నారని అలాంటి వాటికి తావివ్వకుండా తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో తాను రాయని రాతలకు, పెట్టని సంతకాలను సృష్టించి విషప్రచారం చేశారన్న విజయమ్మ.. అలాంటి వాటికి తావివ్వకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భావోద్వేగంతో ప్రకటించారు విజయమ్మ.
కొంతకాలంగా విజయమ్మ పార్టీ నుంచి తప్పుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాంటి ప్రచారాలకు ముగింపు పలకడంతో పాటు తన కుమార్తె పార్టీకి పూర్తి సమయం కేటాయించేందుకు విజయమ్మ వైసీపీ నుంచి తప్పుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.