Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan).. సుదీర్ఘపాదయాత్ర పూర్తి చేసి ఆ పీఠాన్ని అధిష్టించారు. ఆయన సాధించిన విజయం కూడా సాధారణ విజయం కాదు. ఏపీ పాలిటిక్స్ (AP Politics) లోనే రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ అది. అందుకు ప్రధాన కారణం పాదయాత్ర. పాదయాత్ర ముగించి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన.. సీఎం అయ్యారు. తాజాగా అమరావతి రైతులు (Amaravathi Farmers) చేపట్టిన మహాపాదయాత్ర జిల్లాలోని అరసవల్లిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ‘సెంటిమెంట్’పై ప్రజల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలను శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో ముగిస్తే.. వాటికి ఉన్న ఆదరణ... ఆ కార్యక్రమాలు విజయవంతమవుతాయని ప్రచారం ఉంది.
గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) పాదయాత్ర చేపట్టి.. ఇచ్ఛాపురంలో ముగించారు. తర్వాత సీఎం అయ్యారు. తరువాత టిడిపి నేత చంద్రబాబు కూడా ఇలాగే చేశారు. 2014 లో ఆయన సిఎం అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రజా సంకల్పయాత్రను ఇచ్ఛాపురంలో ముగించారు. తర్వాత ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటువంటి సెంటిమెంట్‌లతో పాటు.. జిల్లాలో ముగించే కార్యక్రమాలకు దైవబలం కూడా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రైతుల పాదయాత్ర విజయవంతంగా ముగుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అమరావతి నుంచి రైతులు మహా పాదయాత్ర 2.0కు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి వరకు కొనసాగి, ఇక్కడే యాత్ర ముగియనుంది.. టీడీపీ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ‘అమరావతి ఉద్యమం’ చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు.
‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశారు. అమరావతి ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తయింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర 2.0కు రైతులు శ్రీకారం చుట్టారు. అమరావతిపై అధికార పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, ప్రజలకు రాజధాని ప్రాముఖ్యాన్ని వివరించేందుకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయ్రాత ప్రారంభించారు.
జిల్లాలోనే ఈ యాత్ర ముగించనున్నారు. ఇందులో భాగంగా నవంబరు 9న విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి వెంకటాపురం మీదుగా.. లావేరు మండలం సుభద్రాపురం, అదపాక, బుడుమూరు మీదుగా చిలకపాలేనికి రైతులు చేరుకుంటారు. 10న చిలకపాలెంలో బయలుదేరి.. ఎచ్చెర్ల, షేర్‌మహ్మద్‌పురం మీదుగా శ్రీకాకుళంలో ప్రవేశించి అరసవల్లిలో మహాపాదయాత్ర ముగిస్తారు.
అమరావతి రాజధాని కోసం.. రాజధాని ఏర్పాటుకు భూములిచ్చిన రైతుల త్యాగాలను వృథా కానీయబోమని.. జిల్లాకు వస్తే వారిని సాదరంగా ఆహ్వానిస్తామని ప్రతిపక్ష నాయకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్ర నాయకులు మహాపాదయాత్రలో పాల్గొని సంఘీబావం ప్రకటిస్తున్నారని... తాము కూడా జిల్లాకు అమరావతి రైతులు వస్తే ఆహ్వానిస్తామని జిల్లా ప్రతిపక్ష నేతలు తెలిపారు.
అమరావతి రైతుల రాజధాని ఉద్యమం... ఇతరత్రా సంఘటనలపై జిల్లా ప్రజలకు అవగాహన ఉంది. అయితే రైతులే మహాపాదయాత్రగా జిల్లాకు వస్తున్నారనే విషయం కొంతమందికి పెద్దగా తెలియదు. కానీ, ఈ విషయంలో అధికార పార్టీనేతలే అనధికారికంగా ప్రచారం కల్పించారు.
అధికార పార్టీకి చెందిన మంత్రులు, స్పీకర్.. ఇతర ప్రజాప్రతినిధులు విమర్శలు ఆరంభించారు. ‘అరసవల్లి వస్తే రావచ్చని.. దైవదర్శనం చేసుకోవచ్చని.. తాము మాత్రం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నా’మంటూ అధికార పార్టీ స్టాండర్డ్‌నే తమ మాటగా విలేకరుల సమావేశాలు పెట్టి మరీ చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న ఈ యాత్రను అడ్డుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలా విమర్శల పర్వంతో జిల్లాకు అమరావతి రైతులు పాదయాత్రగా వస్తున్నారనేది చర్చనీయాంశమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, AP Politics