ఏపీలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ అత్యంత వ్యూహాత్మకంగా సాగుతోంది. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోకుండా కేవలం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్న సీఎం జగన్... మాజీలు, ద్వితీయ శ్రేణి నేతల విషయంలో మాత్రం సై అనేస్తున్నారు. తాజాగా టీడీపీ నుంచి వచ్చిన దేవినేని అవినాష్ తో పాటు మరికొందరు నేతలకు కండువా కప్పిన జగన్.. వంశీ వంటి ఎమ్మెల్యేల విషయంలో మాత్రం తన వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతోంది. టీడీపీకి చెందిన కీలక నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్న వైసీపీ అధినేత జగన్, మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధుల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
వారిని పార్టీలోకి చేర్చుకుంటే తమ సిద్ధాంతాల ప్రకారం రాజీనామా చేయించాల్సిన పరిస్ధితి ఉండటంతో కేవలం టీడీపీకి దూరం చేయడంపైనే దృష్టిసారిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గత నెలలో పార్టీతో విభేదిస్తూ అధినేత చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖ పంపిన వంశీ వైసీపీలో చేరకపోవడం వెనుక వ్యూహం ఇదేనని చెప్తున్నారు. టీడీపీకి రాజీనామా చేశాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అటు వైసీపీలో కూడా చేరకుండా ఉండిపోవడమే ఈ వ్యూహం.
దీనివల్ల ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు పడకుండా ఉండటంతో పాటు పాత కేసుల నుంచి ఉపశమనం లభించడం, ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో ఎలాంటి కోతలు లేకపోవడం వంటి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత కొద్దిరోజుల్లోనే వైసీపీలో చేరతారని అఁతా ఊహించారు. కానీ అంచనాలకు భిన్నంగా ఆయన ఇప్పటికీ వైసీపీ చేరకుండా మౌనంగా ఉన్నారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చినా త్వరలో వైసీపీలో చేరతానని మాత్రమే ప్రకటించారు. ఎప్పుడు చేరేదీ వెల్లడించలేదు.
అంతటితో ఆగకుండా గతానికి బిన్నంగా వైసీపీ ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునూ, ఆయన తనయుడు లోకేష్ పై వంశీ తీవ్ర విమర్శలకు దిగారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే ఐదేళ్లలో ఇదే పరిస్ధితి ఉండబోతోందని అర్ధమవుతోంది. అంతేకాదు భవిష్యత్తులో టీడీపీతో పాటు ఇతర విపక్ష పార్టీల నుంచి బయటికి వచ్చే ఎమ్మెల్యేల వ్యూహం కూడా ఇలాగే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పెద్దల నుంచి అందుతున్న సంకేతాల మేరకు వీరు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ లేదా జనసేనలో ఉంటూ పాత కేసులు ఎదుర్కొంటూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేయలేక, అటు నిధులు కూడా తెచ్చుకోలేక తాము ఇబ్బందులు పడుతూ నియోజకవర్గ ప్రజలను సైతం ఇబ్బంది పెట్టడం ఎందుకనే వాదన వీరి నుంచి వినిపిస్తోంది. దీంతో ఈ ఐదేళ్ల పాటు తమ సొంత పార్టీలకు దూరంగా ఉంటూ అలాగని వైసీపీలో చేరకుండా కేవలం బయటి నుంచి మద్దతుతోనే తమ పనులు చక్కబెట్టుకోవాలని భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే ఈ వ్యూహాన్ని గమనించిన చంద్రబాబు వంశీపై ఇప్పటివరకూ నేరుగా విమర్శలు చేయకుండా మౌనంగా ఉంటున్నారు. వంశీ నుంచి విమర్శల దాడి పెరిగితే మాత్రం టీడీపీ స్పందించే అవకాశముంది.
సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 ప్రతినిధి, విజయవాడ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Devineni avinash, TDP, Vallabaneni Vamsi, Ysrcp