Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి నిన్న మొన్నటి వరకూ కేంద్ర ప్రభుత్వానికి అన్నిరకాలుగా మద్దతిస్తూనే ఉన్నారు. రాష్ట్రం వరకు కొన్ని అంశాల్లో విమర్శలు, ఆరోపణలు చేసినా పార్లమెంట్ కు వచ్చేసరికి కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతిస్తున్నారు. అలా చేయడం వలన కేంద్ర పెద్దల మనసు దోచుకుని రాష్ట్రానికి కావలసిన నిధులు పుష్కలంగా తెచ్చుకోవచ్చనేది మొదటిలో ఆయన ఆలోచనగా ఉండేది. ఐతే జగన్ ఎంతలా కేంద్రానికి అండగా నిలుస్తున్నప్పటికీ నిధుల విషయంలో అటువైపు నుంచి మొండిచెయ్యే ఎదురవుతుంది తప్ప ఫలితం లేదు. పైగా కరోనా దెబ్బకి రాష్ట్రప్రభుత్వానికి ఆదాయం లేక పోగా ఖర్ఛులు బాగా పెరిగిపోయాయి. వీటికి తోడు సంక్షేమ పధకాల అమలు తలకు మించిన భారంగా మారడంతో జగన్ సర్కర్ అభివృద్ధి పనులపై పెద్దగా ధృష్టి సారించలేదనేది కాదనలేని సత్యం.
మరోవైపు జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళు పూర్తైంది. మరో ఆరు నెలల తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా.., ఏ పథకం తెచ్చినా అది పూర్తిగా ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోతుంది. ప్రభుత్వ ఆస్తులు తనఖాపెట్టి మరీ ఆ నిధులను సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంచుతుండటంతో అప్పులు, వాటి వడ్డీ భారం రాష్ట్ర ప్రజలమీదే పడుతోంది.
రాష్ట్ర ఆదాయం పెరగాలంటే అభివృద్ధి పనులతోనే సాధ్యం. ఇంతవరకు రాష్ట్రంలో ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి పని కూడా చేయలేకపోయారని సీఎం జగన్ పై విమర్శలున్నాయి. పాలన చేతగాకపోతే దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలలో ఎంతోకొంత నిజమూ లేక పోలేదు. ఎందుకంటే అభివృద్ధి పనుల వలన సంపద సృష్టి జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుంది.
రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడానికి కారణం కేంద్రం సహకరించకలేదనే నెపం వారిపై నెట్టి తద్వాతా తనపై వ్యతిరేకతరాకుండా చూసుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నట్లు విశ్లేషకుల మాట. దీనంతటికీ బలం చేకూరేలా ప్రత్యేక హోదా అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు..
కేంద్రం తమకి అన్యాయం చేస్తుందని నమ్మేలా అభివృద్ధి అంశాన్ని ప్రత్యేక హోదా అంశంతో ముడిపెడితే సరిపోతుందని సీఎం వ్యూహంగా కనిపిస్తోంది. దీనంతటికి జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని సమాచారం. హోదా అంశంపై పోరాడితే కేంద్రంతో జగన్ కు దూరం పెరగడం ఖాయం. అలా జరిగితే ఆయనకు అండగా థర్డ్ ఫ్రంట్ ఉంటుందని.. ఈ అంశంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సానుకూలంగానే స్పందించారు. గతంలోనే జగన్ తనకు సోదరుడని మమత వ్యాఖ్యానించిన ఘటనను కొందరు గుర్తు చేస్తున్నారు. హోదా అంశం ముగిసిన అధ్యాయమని చెప్తున్న బీజేపీని.. అదే నినాదంతో ఇరుకున పెట్టడం ద్వారా థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు వేసేలా జగన్ వ్యూహం రచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Special Status