Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
అమరావతి కథలు.70 వ దశకంలో ప్రముఖ రచయిత శంకరమంచి సత్యం కలం నుండి జాలువారిన కథా సంకలనం. 90వ శకంలో డి.డి. నేషనల్ ఛానల్లో ధారావాహికగా ప్రసారం కావడంతో అమరావతి ప్రాముఖ్యం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రానికి తుళ్ళూరు, తాడికొండ, మంగళగిరి మండలాలలోని కొన్ని ప్రాంతాలను కలిపి"అమరావతి" పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) రాజధాని నిర్మించతలపెట్టారు. ఆయన నిర్ణయానికి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్షనేత వై.ఎస్ జగన్ (YS Jagan) కూడా అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలిపారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా శంఖుస్థాపన కూడా చేపించడం జరిగింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా రాజధాని నిర్మాణ పనులు కొనసాగాయి.
ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారపీఠం కైవసం చేసుకున్నారు. అది మొదలు అమరావతి నిర్మాణం అతిపెద్ద కుంభకోణం అని, అమరావతి పేరుతో రైతుల భూములను తక్కువ ధరకు లాగేసుకున్నారని, రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది. అంతటితో ఆగకుండా అమరావతి అన్నిప్రాంతాల వారికి అందుబాటులో లేదని, అది కేవలం ఒక సామాజికవర్గానికి మాత్రమే రాజధాని అని,అన్నివర్గాలకు అక్కడ ప్రవేశం లేదని ప్రచారం ఊదరగొడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచేదిశగా ప్రయత్నాలు చేశారు.
అంతటితో ఆగకుండా మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఐతే కోర్టు కేసులు, రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలతో మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను కొనసాగించాలంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పులతో రాజధాని నిర్మాణం కొంతమేర ప్రారంభయిందనే చెప్పాలి. ఓ వైపు రాజధాని నిర్మాణం కొనసాగిస్తూనే మళ్ళీ మూడు రాజధానులు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. గడచిన మూడేళ్ళలో మూడు రాజధానులు అంటూ బిల్లును మాత్రం ప్రవేశపెట్టగలిగారు తప్పించి ఆ దిశగా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి.
కర్నూలులో న్యాయ రాజధాని అని ప్రకటించినా ఆ ప్రక్రియకు అటు సుప్రీంకోర్టు ఇటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తప్పని సరి అనే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఉంటుందా..? పోనీ లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వానికి అన్నీ తామైవ్యవహరిస్తున్న సలహాదారులకైనా ఈ విషయం తెలియకుండా ఉంటుందా అనేది సామాన్యుల భావన. ఇన్నాళ్ళలో కర్నూలు న్యాయ రాజధాని విషయమై కేంద్రప్రభుత్వంతో మాటవరసకైనా సరే అనిపించలేక పోవటంతో వైసీపీ చిత్తశుద్ధిని శంకించ వలసి వస్తుంది. పైగా బీజేపీ నేతలు మాత్రం తాము అమరావతికి అనుకూలమంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. తమ పార్టీ నేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేసి ప్రారంభించిన అమరావతికి తాము ఎందుకు అడ్డుపడతామని వారు ప్రశ్నిస్తున్నారు.
గతవారం మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ త్వరలో విశాఖ రాజధానిగా పరిపాలన ప్రారంభించబోతున్నామంటూ చేసిన ప్రకటన పెద్దగా ఆసక్తిరేకెత్తించకపోయినా వైసీపీ ఆలోచనలో మార్పురాలేదనే విషయం మాత్రం తేటతెల్లమైంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు. ఈ లోగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు మహాపాదయాత్ర 2.0 కి సన్నాహకాలు చేసుకుంటున్నారు.
ఎవరి పంతం వాళ్ళది, ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళవి. ఇప్పటికే రాష్ట్రం ఆర్ధికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు అమరావతి తేనెతుట్టెను కదిపి మళ్ళీ రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు కల్పిస్తే ఇప్పటికే పెట్టుబడిదారులు, పారిశ్రామిక రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు కాలంలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ఆగిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు కనుక ప్రభుత్వ పెద్దలు పంతాలు వదిలి రాష్ట్రానికి మేలుచేసే నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government