ఉమ్మడి కృష్ణా (Krishna)జిల్లాలో అధికార పార్టీ నేతల కామెంట్స్ రాజకీయంగా కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాయి. ఎన్టీఆర్(NTR) జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురు నేతల మాటలపై పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో చర్చ మొదలైంది. ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండగానే ఇప్పుడెందుకు ఈ టాపిక్ వచ్చిందని కొందరు అంటుంటే..అసంతృప్తి ఉండటం వల్లే పెద్దాయన అలా మాట్లాడి ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు(Vasantha Nageswara Rao)వరుసగా చేసిన కామెంట్స్‌పై మరో మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali nani)ఖండిస్తే ..వసంత నాగేశ్వరరావు తనయుడు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్(Vasantha krishnaprasad)తండ్రి వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. అంతే కాదు..తనకు పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని..వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ చేయమంటే చేస్తానని లేదంటే పార్టీని బలోపేతం చేయడానికి శ్రమిస్తానంటూ వ్యాఖ్యానించడంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. అధికార వైసీపీకి చెందిన ముగ్గురు నేతలు ఎందుకిలో తలో మాట మాట్లాడుతున్నారని సందేహిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొత్త పంచాయితీ..
ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వరరావు ఈమధ్య కాలంలో వైసీపీ సర్కారుపై వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆమధ్య ఏపీ రాజధానిగా అమరావతి కరెక్ట్ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై వ్యతిరేకతను పరోక్షంగా తెలియజేశారు. తాజాగా కాకతీయ వనసమారాధన కార్యక్రమానికి వెళ్లి ...అక్కడ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వసంత నాగేశ్వరరావు. రాష్ట్రంలో అధికంగా ఓట్లు ఉన్న కమ్మ సామాజికవర్గానికి క్యాబినెట్లో చోటు ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు పార్టీలో, ప్రజల్లో వేరే విధంగా వెళ్లడంతో మాజీ మంత్రి కొడాలి నాని కలుగచేసుకున్నారు.
తండ్రి మాటకు ఎదురు చెప్పనన్న ఎమ్మెల్యే ..
వసంత నాగేశ్వరరావు లాంటి సీనియర్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. అంతే కాదు కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదనడం సరికాదని ..ప్రాధాన్యతను బట్టి ఆయా సామాజికవర్గాలకు పదవులు వస్తాయని..దాన్ని రాజకీయం చేయకూడదన్నారు నాని. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పదవులు కేటాయించాలనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగూణంగానే ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా సమర్ధించుకొచ్చారు కొడాలి నాని.
ఇంటి పోరా లేక అసంతృప్తా..?
తన తండ్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలకు కొడాలి నాని ఖండించడంతో నోరు మెదిపారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఈవిషయంలో తన తండ్రిని కంట్రోల్ చేయలేనని .. ఎప్పుడూ ఏదో విషయంపై మాట్లాడటం ఆయనకు అలవాటేనంటూ సమర్దించుకొచ్చారు. అంతే కాదు కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నట్లుగా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయవద్దని జగన్ ఆదేశిస్తే శిరసావహిస్తానన్నారు వసంత కృష్ణ ప్రసాద్. అంతే కాదు మైలవరంలో వేరే అభ్యర్ధిని నిలబెట్టినా.. నియోజకవర్గ ఇన్చార్జ్ని మార్చినా తాను వారికి సహాకరిస్తానని చెప్పడం కొత్త చర్చకు దారి తీస్తోంది.
నేతల మాటలకు అర్ధాలే వేరులే..
ఇంటి పోరు పడలేక సైడ్ అవ్వాలనుకుంటున్నానని వసంత కృష్ణ ప్రసాద్ చెబుతున్నారు. కాని తనను కాదని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఇచ్చారనే ఆవేదనతోనే వసంత కృష్ణప్రసాద్ ఈవిధంగా మాట్లాడారని జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. మంత్రి పదవి సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో వసంత ఫ్యామిలీ పోటీలో ఉంటుందా లేక పార్టీ మారుతుందా అనే టాపిక్ కూడా జిల్లాలో జోరుగా వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Kodali Nani, Ycp