P Anand Mohan, News18, Visakhapatnam
ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడారు. నాలుగోసారి గెలిచేశారు. వైసీపీ ప్రభంజనంలో గెలుపొందిన ఆ ఎమ్మెల్యే మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డారు. 1998లో ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి కూడా పెట్టుకున్నారు. కానీ.. ఎందరో నిరుద్యోగుల్లా ఆయన కూడా వెనుదిరిగారు. కట్ చేస్తే 2019లో ఎమ్మెల్యే. చోడవరం నియోజకవర్గంలో కీలక నేత. అలాగే పార్టీ అధినేతకి నమ్మిన బంటు. ప్రతిపక్షాల్ని తూర్పారబట్టే నాయకుడు. ఆయనే వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ (MLA Karanam Dharma Shri). తలరాతలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఉంటే ఇక వస్తుందని అంటారు. అది ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా వస్తుందనే అంటారు. అదే ఇప్పుడు ఓ ఎమ్మెల్యే విషయంలో కూడా ప్రూవ్ అయ్యింది. తన జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం తప్పక వస్తుందని చెప్పారట అప్పట్లో అదే నిజమైందని ఇప్పుడు ఎమ్మెల్యే అనుకుంటున్నారు.
కరణం ధర్మశ్రీ. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. అదీ మాడుగుల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ (TDP) అభ్యర్థి రెడ్డి సత్యనారాయణపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచీ పోటీ విజయం సాధించారు.
ఇదంతా ఆయన రాజకీయ ప్రస్థానం. అంతకుముందు పాతికేళ్ల పోరాటం ఆయన జీవితంలో ఉంది. పాతికేళ్ల క్రితం అంటే 1998లో ధర్మశ్రీ డీఎస్సీ రాశారు. అప్పుడే అర్హత సాధించారు. కానీ.. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. మొన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కేదారేశ్వరరావు కూడా ధర్మశ్రీకి స్నేహితులే. అయితే విధి వైపరిత్యం అలా ఉంటుందని వీరిద్ధరి విషయంలోనే తెలుస్తోందిగా. ఇక అప్పట్లో మద్రాసు అన్నామలై యూనివర్సిటీలోనే ధర్మశ్రీ చదివారు. కేదారేశ్వరరరావు మాస్టారుది కూడా ఇదే కళాశాల కావడం విశేషం.
ఉపాధ్యాయుడిగా మారాలనుకున్నాను.. కానీ.. ఇలా ప్రజా సేవకుడిని ఎమ్మెల్యేను అయ్యానంటారు ధర్మశ్రీ. 1998 డీఎస్సీ రాశానని, అర్హత సాధించినా అది పెండింగ్‌లో పడటంతో న్యాయవిద్య (బీఎల్) చదవానన్నారు. తర్వాత మెల్లగా ఇక రాజకీయ ప్రవేశం చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు నియోజవర్గాలకు ఆయన ప్రానినిధ్యం వహించారు. అప్పట్లో ఉద్యోగం వచ్చి ఉంటే పాలిటిక్స్ కంటే టీచర్ గానే సెటిల్ అయ్యేవాడినని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Teacher jobs, Ysrcp