అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన ఇద్దరు నేతల ఫోన్ సంభాషణల లీకులు ఇప్పుడు ఆపార్టీకి తల బొప్పికట్టిస్తోంది. ఒకాయన ఒట్టి మసాజేనా ఇంకేమీ ఉండవా అంటే మరొకాయన అలా వచ్చి ఇలా వెళ్ళు అరగంటలో కానిచ్చేస్తా అంటూ మహిళలతో మాట్లాడిన తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఆ ఫోన్ సంభాషణలలో ఉన్న వాయిస్ లు సత్తెనపల్లి శాసనసభ్యులు, ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులు అంబటి రాంబాబు మరియు రాష్ట్ర మంత్రివర్యులు, అవంతి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అవంతి శ్రీనివాసరావులవే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐతే ఆ గొంతులు తమవి కావని ఎవరో కావాలనే తమపై బురదజల్లడానికే మిమిక్రీ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. అంతేకాదు ఈ వైరల్ ఆడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆ ఇద్దరు ప్రకటించి చేతులు దులుపుకున్నారు.
ఐతే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఆడియో విన్నవారెవరికైనా అవి అసలువో నకిలీవో ఇట్టే అర్ధమౌతుందని.., ఆ గొంతులన్నీ ఒరిజినల్ అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. మహిళలకు అన్యాయం జరిగితే గన్ కన్నా ముందు జగన్ వస్తాడనే వై.సి.పి నేతలు ఇప్పుడు తామే ఇలా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చూస్తుంటే రాష్ట్రంలో మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. అయిన దానికి కాని దానికి మీడియా ముందు బీరాలు పలికే అధికారపార్టీ నేతలు ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. అసలు తమ తప్పు లేకపోతే వాళ్లిద్దరికీ ఆ ఆడియోలతో ఎటువంటి సంబంధం లేదని.., ఇదంతా కుట్రలో భాగమని వైసీపీ నుంచి అధికారికంగా ప్రకటన ఎందుకు చేయడంలేదని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
ఈ వ్యవహారంపై సాక్ష్యాత్తూ రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు, అవంతిలు ఆ ఆడియో టేపుల్లోని వాయిస్ తమది కాదని చెప్తున్నారు. వారి వాయిస్ లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత ఆ వాయిస్ లు వారివే అని తేలితే మహిళాకమీషన్ సహించదు అని సెలవిచ్చారు. మహిళపై ఏవైనా దురాగతాలు జరిగితే దోషులకు మూడువారాలలో శిక్ష పడేలా "దిశ" చట్టం అమలులోకి తీసుకు వస్తున్నాం అని చెప్తున్న వైసీపీ పెద్దలు తమ పార్టీ ప్రజాప్రతినిధుపై మాత్రం చర్యలు తీసుకోవడానికి వంకలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి వ్యవహారాలు వైసీపీలో చాలానే ఉన్నాయని.. బయటపడిందని ముగ్గురేనని అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rambabu, Andhra Pradesh, Avanthi srinivas, Ysrcp