YCP Plenary: వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీలో ప్రత్యేక ప్రకటనలు ఉంటాయా..? అధినేత, సీఎం జగన్ ఎన్నికలపై ప్రకటన చేస్తారా..? వచ్చే ఎన్నికలకు సంబంధించి హామీలపై క్లారిటీ ఇస్తారా..? షాకిచ్చే ఎమ్మెల్యేలకు స్పష్టత ఇస్తారా..? ఇలా ఎన్నో సంచలనాలకు ఈ ప్లీనరీ వేదిక అవుతుందని భావిస్తున్నారు.
YCP Plenary: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తైన తరువాత జరుగుతున్న ప్లీనరీని ఆ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోనూ త్వరలో ఎన్నికలు ఉంటాయని భావిస్తున్న వేళ.. ఈ ప్లీనరీలో అదినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)ఎలాంటి ప్రకటనలు చేస్తారు అన్నది ఆసక్తి పెంచుతోంది. ఈనెల 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లా (Guntur District) లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Acharya Nagarjuana University) ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ (YCP Plenary) నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు వైసీపీ ప్లీనరీ అజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. తొలిరోజు ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల10 నిమిషాలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించనున్నారు. 10:15 గంటల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధనలు జరగనున్నాయి. 10:30 గంటలకు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి (YSR Statue) వైసీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. తరువాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. ఉదయం 10:55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఈ ప్రకటనను పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేయనున్నారు.
11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం జరుగుతుంది. ఆ ఉపన్యాసం కోసమే వైసీపీ కార్యకర్తలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తరువాత పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం పొందుతాయి. ఆ వెంటనే పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం ఉంటాయి. 11:35 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాలను నివేదిస్తారు. తీర్మానాలు ప్రారంభం అవుతాయి. మహిళా సాధికారత దిశ చట్టం మొదటి తీర్మానం ఉంటుంది. ఈ తీర్మానంపై మంత్రులు ఉషశ్రీ చరణ్, రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి ప్రసంగిస్తారు.
ఇక రెండో అంశంగా మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యపై తీర్మానం జరుగుతుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడతారు. 2:30 గంటలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్పై తీర్మానం ప్రవేశపెడతారు. తీర్మానంపై మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రసంగిస్తారు. 3:15 గంటలకు వైద్యంపై తీర్మానం ప్రవేశపెడతారు. మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని మాట్లాడతారు. 4:30 గంటలకు పరిపాలనా- పారదర్శకత అంశంపై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలతో మొదటిరోజు ప్లీనరీ సమావేశం ముగుస్తుంది.
వైసీపీ ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు జరుగతున్నాయి. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 4 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ప్లీనరీ ద్వారా మూడేళ్లలో ప్రభుత్వం ఏం చేసింది? రానున్న రెండేళ్లు ఏం చేయబోతుంది? వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం అవ్వాలి? అనే అంశాలపై చర్చిస్తారు. 9 తీర్మానాలను ప్లీనరీ లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఒక్కో నేత ఒక్కో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఒక్కో అంశానికి సంబంధించి చర్చిందేకు ఐదుగురు సభ్యులకు మాట్లాడే అవకాం ఈ ప్లీనరీలో ఇవ్వబోతున్నారు. ఈ లెక్కన 9 తీర్మానాలపై 45మంది సభ్యులు ప్రసంగించే చాన్స్ ఉంది. నవరత్నాల పేరుతో ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్లీనరీలో 9 తీర్మానాలను ఆమోదించనుంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.