ఏపీ(AP)లో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotam Reddy Sridhar Reddy) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై ఆరోపణలు, విమర్శలతో హీటెక్కిన సమయంలో వైసీపీ(YCP) నాయకురాలు లక్ష్మీపార్వతి తాజాగా టీడీపీ(TDP) గురించి, జూనియర్ ఎంట్రీ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ రాకతో టీడీపీ పుంజుకుంటుందనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. అయితే అందుకోసం ఆయన ఇప్పటి నుంచి ప్రజలతో మమేకమైతే మరో ఐదేళ్ల తర్వాత పొలిటికల్ ఫ్యూచర్ ఉండవచ్చని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్‌ను టీడీపీ శ్రేణులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పిన లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi) ఇప్పుడు వచ్చినా ప్రయోజనం ఉండదన్నారు.మరోసారి వైఎస్ జగనే(YS JAGAN) రాష్ట్రానికి సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ గ్రాఫ్ పెరిగిందో లేక వైసీపీలో నేతల అసంతృప్తి కారణమో తెలియదు కానీ..షడన్‌గా ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చిన లక్ష్మీపార్వతి టీడీపీ నేతల్లో గందరగోళం సృష్టించడానికే కొత్త పాలిటిక్స్‌కి ప్లే చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడొచ్చినా ప్రయోజనం లేదన్న ఆమె ఐదేళ్ల పాటు ప్రజలతో మమేకం కావాలని చెప్పడంపై ఈ రెండు నాల్కల ధోరణి ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఇక ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని ..తన సినిమాలేవో తాను చేసుకుంటానని చెప్పిన ఎన్టీఆర్‌ను వైసీపీ నాయకురాలు మళ్లీ ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారో వాళ్లకే అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
లక్ష్మీపార్వతి పలుకులకు అర్ధమేంటి..?
వైసీపీలో అసంతృప్తి సెగలు, టీడీపీలో లోకేష్ యాత్రతో పాటు నేతల విమర్శలు, ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఈక్రమంలోనే వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలని ఆపార్టీ శ్రేణులు కోరడం చూస్తుంటే ఆయనకు భవిష్యత్ ఉందని చెప్పారు. ఇప్పటి నుంచి మరో ఐదేళ్ల పాటు ప్రజలతో మమేకం కావాలని అప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందన్నారు. రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఇప్పటికే ఆలస్యం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడొచ్చినా ఎలాంటి పదవులు వరించవని..మళ్లీ ముఖ్యమంత్రి జగనే అవుతారని జోస్యం చెప్పారు. జగన్‌లాగేనే ఐదేళ్ల పాటు ప్రజలతో ఉంటే ప్రయోజనం ఉంటుందన్నారు.
అందరూ కలుస్తారనే భయంతోనేనా..
జూనియర్ ఎన్టీఆర్‌ని షడన్‌గా పొలిటికల్ వ్యవహారాల్లోకి లక్ష్మీపార్వతి లాగడం చూస్తుంటే ఇదంతా వైసీపీ ఎత్తుగడా ఉందంటున్నారు టీడీపీ శ్రేణులు. మొదట్నుంటి జూనియర్ ఎన్టీఆర్‌పై జాలి చూపిస్తూ వస్తున్న లక్ష్మీపార్వతి ఉన్నపళంగా అతని రాజకీయ భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, అతనితోనే టీడీపీ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతే కాదు తారకరత్న అస్వస్థతకు గురి కావడం, బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ బెంగుళూరు వెళ్లడంతో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకుంటుందేమో..ఒకవేళ అదే జరిగితే ...వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందన్న ఆలోచనతోనే వైసీపీ అధిష్టానం లక్ష్మీపార్వతితో ఈవిధంగా మాట్లాడించి ఉండవచ్చని ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు అంటున్నారు.
ఆరోపణలకు అర్ధమేంటీ..?
ఇదిలా ఉంటే మరోవైపు మంత్రి కొడాలి నాని ..వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబుపై తమకు అనుమానాలు ఉన్నాయనే సందేహాన్ని ఇప్పుడు వ్యక్తం చేయడం కూడా చర్చనీయాంశమైంది. "వివేకా హత్య జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయన కాల్ డేటా పరిశీలించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ కూడా జరిపించాలని కోరడం చూస్తుంటే వైసీపీ నేతలు పొలిటికల్ డిఫెన్స్ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.