ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి(Amaravati) టు అరసవెల్లి వరకు రైతులు చేస్తున్న పాదయాత్ర కొన్ని వారాల నుంచి సాగుతోంది. తమ పాదయాత్రకు ఉభయ గోదావరి జిల్లాల వాసుల నుంచి మంచి మద్దతు లభిస్తోందని.. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి కూడా ఇదే రకమైన మద్దతు ఉంటుందని పాదయాత్ర చేస్తున్న రైతులు చెబుతున్నారు. అయితే ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటే తమ విధానమని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం.. ఈ అంశంపై మరింత స్పీడు పెంచింది. ఓ వైపు ఈ అంశంపై నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తూనే.. ఉత్తరాంధ్రలో విశాఖ (Visakhapatnam)రాజధాని ఏర్పాటుకు ప్రజల మద్దతు ఉందని చాటిచెప్పేందుకు వైసీపీ(Ysrcp) నేతలు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు.
వైసీపీకి చెందిన మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్తో పాటు పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వంటి వాళ్లు ఈ అంశంపై రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి వైసీపీ నేతలు ఈ రకమైన వ్యూహాన్ని ఎందుకు ఎంచుకున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలోనూ ఎలాంటి నిరసలు లేకుండా కొనసాగితే.. తమకు ఉత్తరాంధ్రలోనూ అమరావతి రాజధానికి మద్దతు లభించిందనే వాదనను పాదయాత్ర చేస్తున్న వాళ్లు, వారికి మద్దతుగా ఉంటున్న టీడీపీ నేతలు తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
అదే జరిగితే.. ఏపీలో మూడు రాజధానులకు మద్దతు లేదని టీడీపీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించడంతో పాటు ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. దీంతో టీడీపీ నేతలు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేయడానికి ముందు అక్కడి ప్రజలు కూడా ఈ అంశాన్ని స్వాగతిస్తున్నారనే అంశాన్ని బలంగా చాటిచెప్పాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.
Pawan Kalyan: దేనికీ గర్జనలు.. ప్రశ్నలతో హోరెత్తెంచిన పవన్.. మియాం మియాం అంటూ కౌంటర్
Rk Roja: పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడు..మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే వైసీపీ నేతలు రాజీనామాల అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకోవడానికి ముందే ఉత్తరాంధ్రకు రాజధాని కావాలనే విషయంలో ప్రజల నుంచి మద్దతు సంపాదించడం ద్వారా అమరావతి రైతులకు, టీడీపీకి కౌంటర్ ఇవ్వాలనే యోచనలో వైసీపీ ఉందని సమాచారం. అయితే నిజంగానే వైసీపీ నేతలు రాజధాని కోసం రాజీనామాలు చేస్తారా ? లేక ఈ విషయంలో ప్రత్యర్థులను ఇరుకునపెట్టేందుకు మాత్రమే వీటిని ఉయోగించుకుంటారా ? అన్నది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.