Anna Raghu, News18, Amaravati
వైఎస్ఆర్సీపీ (YSRCP) రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఈ నెల 8,9 తేదీల్లో జరగబోతోంది. వైసీపీ ప్లినరీ (YSRPC Plenary-2022) ని రాష్ట్ర పండుగల రాష్ట్రమంతా జరుపుకోవాలని పార్టీ ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. ఏర్పాటైన తరువాత జరుగుతున్న మొదటి ప్లినరీ కావటం తో వైసీపీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి (YS Vijayamma) పాల్గొంటారా లేదా అన్న సందేహం ఆ పార్టీ నేతల్లోనే కాదు.. కార్యకర్తల్లోనూ ఉంది. దీనికి కారణం.. కొంతకాలంగా విజయమ్మ వైసీపీ కార్యక్రమాల్లో కనిపించకపోవటమే. ఆమె తరుచూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) కార్యక్రమాలకు హాజరవటమే. తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన కుమార్తెకు సహాయంగా విజయమ్మ ఉంటున్నారు. షర్మిల పాదయాత్రలోనూ, ఆమె పార్టీ సభల్లోనూ పాల్గొంటున్నారు.
ఈ మధ్యకాలంలో వైసీపీ కార్యక్రమాల్లో కనిపించని విజయమ్మ వైసీపీ ప్లీనరీకి వస్తారా రారా అనే చర్చ సాగుతోంది. ఇటీవలి పరిణామాలతో విజయమ్మ వైసీపీ పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ కు ఇష్టం లేకుండా షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయటంతో ఇద్దరికీ పడటం లేదనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
విజయమ్మ కూడా కుమార్తె వైపే మొగ్గు చూపారు. అప్పటి నుంచి కుమారుడు, సీఎం జగన్ తో విజయమ్మకు పెద్దగా మాటల్లేవని టాక్. షర్మిల పార్టీ కార్యక్రమాలకు వెళ్తున్న తాను..వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగటం సరికాదనే అభిప్రాయంతో కూడా ఆమె ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని విజయమ్మ జగన్ దగ్గర ప్రస్తావించి.. రాజీనామాకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే వైసీపీ ప్లీనరీ వరకూ ఆ పదవిలో కొనసాగాలని జగన్ కోరినట్లుగా సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షర్మిల సైతం ఈ అంశంపై స్పందించారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం గురించి సమాధానం ఇస్తూ.. తన తల్లిగా వైఎస్సార్ టీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు.
మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో జగన్ వ్యవహార శైలిపై కూడా వెఎస్ కుటుంబం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. వివేకా హత్య కేసు నిందితులను జగన్ వెనకేసుకు వస్తున్నారనే కారణంతో వైఎస్ బంధువులు గుర్రుగా ఉన్నారట. వివేకా కుమార్తె సునీతతో పాటు విజయమ్మ, షర్మిలతో సహా వైఎస్ తరుఫున బంధుగణమంతా జగన్ తీరుపై కినుక వహించినట్లు తెలుస్తోంది. షర్మిల భర్త, క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ కూడా బహిరంగంగానే జగన్ పట్ల అసంతృప్తిని వెళ్ళగక్కారు.
మొత్తంగా కుటుంబ సమస్యల కారణంగా విజయమ్మ ప్లీనరీ సమావేశాలకు వస్తారా..? రారా..? అనేది అనుమానంగానే కనిపిస్తోంది. ఐతే ప్లీనరీకి విజయమ్మ వస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించి.. వైసీపీ బైలాస్ లో సవరణ చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ విజయమ్మ ప్లీనరీకి రాకపోతే ఆమె వైసీపీతో తెగ తెంపులు చేసుకున్నారనే సంకేతాలు పార్టీ శ్రేణులకు, జనాల్లోకి వెళ్తాయి. అదే జరిగితే వైసీపీకి నష్టం చేకూరటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, YS Vijayamma, Ysrcp