Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పాదయాత్రలకు పెద్ద హిస్టరీనే ఉంది. పాదయాత్ర చేస్తే చాలు అటునుంచి అటే నడుచుకుంటూ సీఎంఓకి వెళ్లొచ్చనే భావన బలంగ ఉంది. తాజాగా రాజధాని రైతుల పాదయాత్ర విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. అమరావతి రైతులు (Amaravati Farmers) తలపెట్టిన రెండవవిడత పాదయాత్ర కొనసాగుతుంది. అమరావతి టు అరసవల్లి వరకు సుమారు 450 కి.మీ ఈ సుదీర్ఘ యాత్ర మొదలు కాకముందే ప్రభుత్వం వైపు నుండి ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి హైకోర్టు కలుగజేసుకోవడంతో యాత్రకు అనుమతులు లభించాయి. గత వారం రోజులుగా పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో యాత్ర సాగుతోంది. మరోవైపు అభివృద్ధి వికేంద్రీకరణ తమ నినాదమని.., అమరావతిలోనే అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అన్యాయం చేసినట్లు అవుతుందని వైసీపీ వాదిస్తోంది. అందుకే తాము కోస్తా ప్రాంతంలోని అమరావతితో పాటు అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనే సదుద్దేశ్యంతోనే మూడు రాజధానులు తీసుకువస్తామంటున్నారు వైసీపీ నేతలు.
రాజధాని కోసం ఎంతో విలువైన తమ భూములను ప్రభుత్వానికి అప్పజెపితే తమ భూములను స్మశానాలు, బీళ్ళు అంటూ తమను అవమానించడమే కాకుండా.. తమ ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం ఒకసామాజిక వర్గానికి మాత్రమే అంటగట్టి కుట్రలు చేస్తోందని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం అమరావతి రైతులకు ఇష్టంలేదంటూ మిగతా ప్రాంతాల వారిని రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టిస్తున్నారనేది ఆందోళనకారుల వాదన. తమకు అన్యాయం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ఉత్తరాంధ్రలో కొలువై ఉన్న అరసవెల్లి సూర్యభగవానుడిని వేడుకునేందుకు తాము పాదయాత్ర తలపెట్టామంటున్నారు రాజధాని రైతులు.
60 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలకు తమ బాధలు తెలియచెప్తామని అంటున్నారు రైతులు. మూడు బిల్డింగులు కట్టలేని ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారంటూ, కేవలం విశాఖ వంటి ప్రాంతాలలో విలువైన భూములను కాజేయటానికే ప్రభుత్వ పెద్దలు మూడురాజధానులు అంటూ నాటకాలు మొదలు పెట్టారంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
ఇదిలా ఉంటే గతంలో న్యాయస్థానం to దేవస్థానం పేరుతో అమరావతి రైతులు తిరుమలకు పాదయాత్ర చేశారు. పాదయాత్ర సమయంలోనే హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని రైతులు భావిస్తున్నారు. సుప్రీం కోర్టు కూడా అమరావతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందంటున్నారు.
ఐతే రాజకీయాల్లో పాదయాత్రలు సక్సెస్ అయ్యాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ పాదయాత్రలు చేసి సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు తాము కూడా పాదయాత్ర చేసే అమరావతని నిలబెట్టుకుంటామని రైతులంటున్నారు. పార్టీలకు అధికారాన్ని తెచ్చిన పాదయాత్రలు.. రాష్ట్రానికి అమరావతిని తీసుకొస్తాయా అనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, AP Politics