AP POLITICS WILL FREE RATION RICE TO CASH PROGRAMME MAY BE POSTPONE MINSTER GAVE CLARITY NGS
Ration Rice: బియ్యానికి నగదు బదిలీ తీసుకుందామనుకుంటున్నారా? ఒక్కసారి ఈ వార్త చదవండి..
బియ్యానికి బదులు నగదు పథకం
AP Ration:ఏపీలో ఉచిత బియ్యానికి నగదు బదిలీ సాధ్యం కాదా..? ప్రభుత్వం ఎందుకు ఈ పథకంలో అంత టెన్షన్ పడుతోంది. ప్రజలు కూడా ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఒకవేళ బియ్య వద్దని.. నగదు తీసుకుంటే.. కార్డులు కట్ అవుతాయా..? ప్రభుత్వం ఏమంటోంది..?
AP Ration: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్తగా ప్రారంభించాలి అనుకున్న పథకానికి ఆదిలోనే ఆటంకాలు తప్పడం లేదు.. సాధారణంగా ఏదైనా పథకాన్ని సీఎం జగన్ (CM Jagan) ప్రారంభించాలి అనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకే వెళ్తారు.. కానీ బియ్యానికి నగదు బదిలీ వాయిదా పథకం విషయంలో వెనుకడుగు వేస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యాని (Ration Rice)కి నగదు బదిలీపై పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు (Karumuri Nageswara Rao)కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టామని మంత్రి చెప్పారు. యాప్ లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీ నిలిపివేశామన్నారు. నగదు బదిలీపై తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటే సమాచారం తేలియజేస్తామని మంత్రి వెల్లడించారు.
ఈ పథకం ప్రారంభానికి ముందే విమర్శలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రేషన్ బియ్యానికి నగదు బదిలీపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఓట్ల కోసం ఇలా నోట్లు పంచడం దారుణమని విపక్ష నేతలు మండిపడుతున్నారు. అయితే విమర్శలు, ఆరోపణలను మంత్రి ఖండించారు. పేద ప్రజలకు నగదు బదిలీ పథకంపై ప్రతిపక్ష పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నగదు బదిలీ ప్రారంభించాలని 2017లోనే కేంద్రం సూచించిందని గుర్తు చేశారు. కేంద్రం ఆదేశాలపై అదే పార్టీ (బీజేపీ) విస్మరించడం విడ్డూరంగా ఉందని.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రేషన్ నగదు బదిలీ పథకాన్ని ముందు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నామన్నారు.
ఇందులో ఎలాంటి బలవంతం లేదన్నారు మంత్రి.. ఇష్టం ఉన్న వాళ్లకి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు. అది ఇష్టం లేని వాళ్లకి బియ్యం ఇస్తామని చెప్పారు. బియ్యానికి ఇచ్చే డబ్బుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాల్లో కేంద్రం సూచనలతోనే ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. రేషన్‌కు సంబంధించిన నిజమైన లబ్ధిదారులకు కార్డులు తొలగిస్తామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అలాగే ఈ ఏడాది జూన్‌లో కొత్త కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
ముందు అనుకున్నదాని ప్రకారం.. రేషన్ బియ్యానికి నగదు బదిలీ పథకాన్ని మే నెల నుంచి ప్రారంభించాలని భావించామన్నారు. రేషన్ బియ్యం వద్దంటే కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా డబ్బులు వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ముందుగా కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావించింది అన్నారు. కొన్ని నెలల పాటు డబ్బులు తీసుకుని.. ఆ తర్వాత బియ్యం కావాలన్నా తీసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.