ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ గందరగోళమైన పరిస్థితిలో ఉన్నట్టు ఆ పార్టీ నేతల మాటలను బట్టి అర్థమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం జనసేనతో(Janasena) ఆ పార్టీ పొత్తు వ్యవహారమే. బీజేపీ,(BJP) జనసేన పొత్తుల్లో ఉన్నా.. ఆ రెండు పార్టీలు ఎప్పుడు కలిసి ముందుకు సాగిన దాఖలాలు లేవు. అయితే జనసేన తమ మిత్రపక్షమని బీజేపీ నేతలు పదే పదే చెప్పుకునేవారు. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. దీనికితోడు ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జనసేన శ్రేణులు పని చేశాయనే అనుమానాలు బీజేపీలో ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మద్దతు ఇవ్వాలని కోరినా.. అందుకు పవన్ కళ్యాణ్ నుంచి స్పందన రాలేదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సైతం పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) పరోక్షంగా కామెంట్స్ చేశారు. దీంతో ఏపీలో బీజేపీ, జనసేన మధ్య రాజకీయ సంబంధాల వ్యవహారం దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చినట్టే అనే చర్చ జరుగుతోంది. నిజానికి బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ.. తాను టీడీపీతో రాజకీయ స్నేహం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేకసార్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే బీజేపీ నేతలు ఈ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. అలాగని జనసేనతో కలిసి రాజకీయంగా కార్యాచరణ కూడా రూపొందించుకోలేదు.
అయితే తాజాగా తమ సిట్టింగ్ స్థానమైన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ సీటును కోల్పోవడం.. అక్కడ ఈసారి తమకు డిపాజిట్ కూడా రాకపోవడంపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. తమ పరిస్థితి మరీ ఈ స్థాయిలో ఉండటానికి జనసేన కూడా ఓ కారణమనే వాదన బీజేపీలో ఉంది. తమకు ఏ మాత్రం కలిసిరాని జనసేనతో ఇంకా కలిసి ఉన్నామని చెప్పుకోవడం ఎందుకనే భావన ఆ పార్టీల్లో నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో జనసేన విషయంలో ఇకపై ఏ రకమైన వైఖరితో ముందుకు సాగాలనే దానిపై కూడా బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.
Chandrababu Future: చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా..? లోకేష్ భవష్యత్తు ఏంటి..? టీడీపీ పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..?
CM Jagan Future: ఈ ఏడాది సీఎం జగన్ జాతకం ఎలా ఉంది? రాజకీయంగా కలిసి వస్తుందా? రాజపూజ్యం ఎంత? అవమానం ఎంత?
మరోవైపు జనసేన విషయంలో ఏపీ బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంటుందా ? అనే చర్చ కూడా మొదలైంది. రాష్ట్ర బీజేపీ నేతల కంటే ఆ బీజేపీ జాతీయ నాయకత్వంతోనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా సమావేశమవుతూ వచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి వారిని పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు కలిస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర నేతలతో మాత్రం పవన్ కళ్యాణ్‌కు పెద్దగా సత్సంబంధాలు లేవని కొందరు చర్చించుకుంటున్నారు. మరి.. తాజా పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp, Janasena