తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయానికే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు అక్కడి అధికార వైసీపీ(Ysrcp) దాదాపుగా డిసైడయ్యిందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రజల్లో పార్టీ, ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తులు, నేతల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం జగన్(YS Jagan). ఇందుకోసం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా సొంత నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ మాత్రం అలసత్వం వహించినా.. సీఎం జగన్ సహించడం లేదు. ఈ కార్యక్రమం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేతలు, ప్రజల్లో సానుకూలత లేని నేతలకు వచ్చే ఎన్నికల్లో మోహమాటం లేకుండా టికెట్ నిరాకరిస్తానని ఆయన స్పష్టం చేశారు.
గత సమీక్ష సందర్భంగా 27 మంది నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని.. వారి పట్ల ప్రజల్లో సానుకూలత లేదని సీఎం జగన్ చెప్పారు. అందులో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు ఉన్నారు. వారికి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసిన సీఎం జగన్.. పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో సీఎం జగన్ మరోసారి సమీక్ష నిర్వహించబోతుండటంతో.. ఈసారి ఎంతమంది నేతలపై అధినేత అసంతృప్తి వ్యక్తం చేస్తారో అనే చర్చ జోరందుకుంది.
అయితే పీకే టీమ్(PK Team)నివేదిక ఆధారంగానే సీఎం జగన్ పలువురు నేతలకు క్లాస్ తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో 27 మంది నేతలు గడప గడపకు కార్యక్రమాన్ని లైట్ తీసుకోగా.. ఈసారి ఆ సంఖ్య 11కు తగ్గిందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ 11 మందిలో పలువురు మంత్రులు కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
Araku Tour: హైదరాబాద్ నుంచి అరకు ... రూ.7,000 లోపే 5 రోజుల టూర్
AP Politics: ఐటీ దాడులు.. ఈడీ నోటీసులు.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరుగుతోంది..?
వీరిలో పలువురు ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు కూడా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు అనే ఊహాగానాలు వైసీపీ వర్గాల్లో మొదలైంది. మొత్తానికి ప్రజల్లోకి వెళ్లే విషయంలో పార్టీ నేతలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. తాను ఉపేక్షించబోనని మరోసారి సీఎం జగన్ వైసీపీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వబోతున్నట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.