ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రాజధానిపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం, గందరగోళం కొనసాగుతూనే వస్తోంది. రాజధాని అమరావతి స్థానంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికార వైసీపీ... ఇందుకు సంబంధించి అసెంబ్లీలో చట్టాలను కూడా తీసుకొచ్చింది. అయితే వాటి కారణంగా న్యాయపరమైన ఇబ్బందులు రావడంతో.. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. త్వరలోనే ఈ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును మరింత పక్కాగా రూపొందించిన అసెంబ్లీలో పెడతామని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇదిలా ఉంటే ఏపీ రాజధానిగా కేంద్రం ఏ ప్రాంతాన్ని గుర్తిస్తుందనే అంశంపై చాలాకాలం నుంచి సందేహాలు ఉన్నాయి. దీనిపై తాజాగా కేంద్రం వివరణ చ్చింది. ఏపీ రాజధాని అమరావతి అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.
ఏంపీ జీవీఎల్ వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ జరిగిన సమావేశంలో ఎంపీ జీవీఎల్..ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత అసలు రాజధాని ఏదో తెలియడం లేదన్నారు. ఏపీ రాజధాని ఏదో కేంద్రం ఒక క్లారిటీ ఇవ్వాలని కోరారు. రాజధానిపై ఎవరు నిర్ణయం తీసుకోవాలని ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. అయితే రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని..కేంద్రం స్పష్టం చేసింది. మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని తర్వాత అమరావతి రాజధాని అంటూ తమకు సమాచారం ఇచ్చారని, అనంతరం 2020లో 3 రాజధానులుగా చేశారని వివరించారు.
పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని చెప్పారని అన్నారు. తమ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన సమాధానంతో ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతి అనే విషయంలో క్లారిటీ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించినా.. గుర్తించకపోయినా.. కేంద్రం మాత్రం ఈ విషయంలో అమరావతినే రాజధానిగా గుర్తిస్తోందనే విషయంలో స్పష్టత వచ్చింది.
YS Jagan on Budget: బడ్జెట్ విషయంలో జగన్ వైఖరేంటి..? ఆ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తారా..?
అయితే ఏపీకి విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా మార్చాలనే నిర్ణయంతో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఈ విషయంలో మరోసారి ఆ దిశగా చట్టం చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో జగన్ సర్కార్ మరోసారి మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు తీసుకొస్తుందా ? లేక ఈ అంశం జోలికి వెళ్లకుండా ఉంటుందా ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కేంద్రం చేసిన ప్రకటనతో ఏపీ సీఎం జగన్ అమరావతి విషయంలో మళ్లీ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.