మాచర్ల నియోజకవర్గం. పల్నాడు ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు మాచర్ల. గతంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో రాజకీయ హత్యలు కూడా జరిగాయి.అటువంటి నియోజకవర్గంలో ఓకే వ్యక్తి వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయనే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) ముద్దుగా పి.ఆర్.కె (P.R.K)అని పిలుచుకుంటారు ఆయన అభిమానులు. 1996లో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2004 - 2009 మధ్యకాలంలో వెల్దుర్తి జెడ్పిటిసిగా పని చేశాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్ల(Macherla) నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
వై యస్ రాజశేఖర్ రెడ్డి(YSR) మరణాంతరం జరిగిన పరిణామాలలో పిన్నెల్లి తన శాసనసభ సభ్యత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ వెంట నడిచాడు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.ఆ తరువాత 2014,2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు.ప్రస్తుతం ఆయన శాసనసభలో ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు.
మొన్నటి మంత్రివర్గ విస్థరణలో పిన్నెల్లికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు.ఐతే కొన్ని సమీకరణల కారణంగా జగన్ ఆయనకు అవకాశం కల్పించలేక పోయారు. దీంతో పిన్నెల్లి అనుచరుల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్ కోసం శాసనసభ్యత్వాన్ని సైతం వదులుకుని ఆయన వెంట నడిచిన తనని పార్టీ అధిష్టానం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని పిన్నెల్లి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడనే ప్రచారమూ లేక పోలేదు.
ఐతే నాలుగుసార్లు శాససభ్యునిగా వరుస విజయాలు సాధించినా.. జగన్ కోసం పదవిని సైతం త్యాగం చేసిన పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని అధిష్టానం పెద్దలు పిలిచి బుజ్జగించారు. ఆ సందర్భంగా పిన్నెల్లి తనకు ఎలాగూ మంత్రి పదవి దక్కలేదు కనీసం తన తమ్ముడు వెంకట్రామిరెడ్డికి వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ కేటాయించమని కోరినట్లు మాచర్లలో ప్రచారం జరుగుతుంది.దీనికి అభిష్టానం పెద్దలు కూడా సానుకూలంగానే స్పందించారని పిన్నెల్లి వర్గం చెప్పుకుంటున్నారు.
TDP Strategy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు..?
YS Jagan: జగన్ సర్కార్ ఏడాది కాలంలో అమలు చేయబోయే పథకాలు ఇవే.. పూర్తి వివరాలు
రామలక్ష్మణుల వంటి పిన్నెల్లి సోదరులు ఈ సారి ఎన్నికలలో చెరొక నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ఆయన వర్గం ప్రచారం చేస్తుంటే, బోర్డర్ చెక్ పోస్ట్‌ను గుప్పెట్లో పెట్టుకుని గుట్కా, తెలంగాణ మద్యం, గ్రానైట్ స్మగ్లింగ్ వంటి అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డికే ఈ సారి టికెట్ వచ్చేది అనుమానం అనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలో ఆయన తమ్ముడికి జగన్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు.
ఏది ఏమైనా అధికారం కోసం అయిన వారిని సైతం దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో తమ్ముడి కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన పిన్నెల్లిని అభినందిస్తున్నారు వైసీపీ అభిమానులు. తమ్ముడిని శాసన సభ్యుడిని చేయాలనే పిన్నెల్లి కలని వైసీపీ అధినేత జగన్ నెరవేరుస్తాడో లేదో తెలియాలంటే మరో ఏడాది ఎదురు చూడక తప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.