ఏపీలోని చాలామంది నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పేందుకు కూడా వాళ్లు వెనకాడటం లేదు. ఈ లిస్టులో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, అందులోనూ సీఎం జగన్‌కు (ys jagan) సన్నిహితులుగా చెప్పుకునే వాళ్లు కూడా ఉన్నారు. వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (chevireddy bhaskar reddy) ఒకరు. తన కుమారుడు మోహిత్‌ను(Mohit) ఆశీర్వదించాలని ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలను కోరారు. తాను ఎక్కడ ఉన్నా చంద్రగిరి అభివృద్ధిని మరువనని చెబుతున్నారు. దీన్ని బట్టి ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడి రంగంలోకి దించబోతున్నారని క్లియర్‌గా అర్థమవుతోంది.
అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న ప్రకటనపై వైసీపీ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారసుడు మోహిత్ రెడ్డిని బరిలోకి దింపాలన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? లేక ఇది కేవలం చెవిరెడ్డి చేసుకుంటున్న ప్రచారం మాత్రమే అన్నది తెలియడం లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ విషయంలో చెవిరెడ్డికి సీఎం జగన్ నుంచి అనుమతి లభిస్తే.. మరికొందరు నేతలకు కూడా దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
మాజీమంత్రి పేర్ని నాని , మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం ఇదే ప్రతిపాదనను సీఎం జగన్ ముందు ఉంచారు. అయితే వీరి ప్రతిపాదనలను సీఎం జగన్ తిరస్కరించారని గతంలో వార్తలు వచ్చాయి. మీరే పోటీ చేయాలని సీఎం జగన్ తమతో అన్నట్టు మాజీమంత్రి పేర్ని నాని అప్పట్లో కామెంట్ చేశారు. దీంతో ఒకవేళ సీఎం జగన్ చెవిరెడ్డికి వారసుడి ఎంట్రీ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరోసారి పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనను వైసీపీ అధినేత ముందు ఉంచే అవకాశాలు లేకపోలేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
YCP vs Rebel: జగన్ ను ఢీ కొడుతున్న రెబల్ ఎమ్మెల్యేలు.. రాజకీయ సునామి తప్పదంటూ వార్నింగ్..
ఈ విషయంలో ఒకరికి ఓకే చెప్పి.. మరొకరికి నో చెబితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారసులను తమ స్థానంలో చూసుకోవాలని భావిస్తున్న నేతల ప్రయత్నాలు నిజంగానే ఫలిస్తాయా లేక ఇదంతా వారి కోరిక మాత్రమేనా ? అనే విషయం తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురుచూడాల్సిందే అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.