ఏపీలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మూడు స్థానాల్లో వైసీపీ ఎదురొడ్డుతోంది. రెండు స్థానాల్లో టీడీపీ పైచేయి సాధించగా.. మరో స్థానంలో టీడీపీ, వైసీపీ మధ్య పోరాటం హోరాహోరీగా సాగుతోంది. ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే.. ఈ మూడు స్థానాలు టీడీపీ ఖాతాలో పడటం ఖాయమనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈ ఎన్నికలు ఒకరకంగా ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో.. వైసీపీకి(Ysrcp) ఇది పెద్ద దెబ్బ అనే చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ(Tdp) అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. తూర్పు రాయలసీమ(Rayalaseema) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పరిస్థితి ఇదే రకంగా కొనసాగుతోంది. ఇక్కడ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
అయితే ఈ ఫలితాలను వైసీపీ నాయకత్వం ఏ రకంగా విశ్లేషించుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతకు ఇది అద్దం పడుతోందని టీడీపీ అప్పుడే మాటల యుద్ధం మొదలుపెడుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇది సంకేతమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలతో వైసీపీ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడుతుందా ? అనే చర్చ కూడా జరుగుతోంది.
ఈ ఎన్నికల ఫలితాలు, సాధారణ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉంటాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి అండగా ఉండే వర్గాలతో పాటు తమకు కచ్చితంగా ఓట్లు వేస్తారని అనుకునే వర్గాలు ఈ ఎన్నికల్లో ఓట్లు ఉండవని చెబుతున్నారు. పట్టుభద్రుల ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని.. కొంతకాలంగా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు ఈ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటారని పలువురు లెక్కలు వేసుకుంటున్నారు.
Cm Jagan: ప్రధాని మోదీ , అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ..కీలకాంశాలపై చర్చ
50 మంది గిరిజన విద్యార్థినులకు అస్వస్థత... అసలేం జరిగిందంటే..
మరోవైపు ఇలాంటి వాదనలు వినిపించి.. ఎన్నికల ఫలితాల ప్రభావం లేకుండా చూపడం కష్టమే అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల ప్రభావం ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులపై కూడా ఉండే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలను మంత్రులు సీరియస్‌గా తీసుకోలేదనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సీఎం జగన్ వీటిని ఏ రకంగా విశ్లేషిస్తారు ? ఆ తరువాత ఏ రకంగా ముందుకు సాగుతారు ? వ్యూహం మార్చుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, TDP, Ysrcp