Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైందా..? ముహూర్తం కూడా ఫిక్స్ చేశారా..? ఎన్నికల ఏడాది కావడంతో.. కీలక మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారా..? అందులో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni seetaram) ను మంత్రి పదవి వరించనుందా..? ఆయన స్థానంలో ఇంకో మంత్రి స్పీకర్ అవుతారా..? వైసీపీ వర్గాల్లో ప్రస్తుతం ఈ చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ పరాజయం తర్వాత అక్కడ పరిస్థితుల్ని మార్చాలని జగన్ ఫిక్స్ అయినట్టు టాక్. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మంత్రి వర్గంలో మార్పు చేర్పులపై సీరియస్‌గా దృష్టి పెట్టి కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రులను కొందరని మార్చడంతో పాటు.. అందరి శాఖలు మార్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు.
తాజాగా సీఎం క్యాంప్ ఆఫీసుకు అత్యవసరంగా మంత్రి సీదిరి అప్పలరాజు హాజరవ్వడంతో ఈ చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు.. ఒక స్పీకర్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒకరిపై వేటు పడక తప్పదు..? ఒక స్పీకర్ తమ్మినేని సీతారాంను మంత్రి చేస్తారని తెలుస్తోంది. ధర్మానతో కూడా సీఎం చర్చలు జరపడంతో.. ఆయన్ను స్పీకర్ చేస్తారా అనే చర్చ మొదలైంది.
మరి సీదిరి పరిస్థితి ఏంటి..? ఉత్తరాంధ్రలో కొద్దిపాటి మార్పులతో సమూల ప్రక్షాళన జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. కొన్ని కొత్త సమీకరణాలను సీఎం జగన్ వర్కవుట్ చేసినట్లుగా చెబుతున్నారు. స్పీకర్ గా ఉంటూ తమ్మినేని సీతారాం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సహజంగా స్పీకర్ గా ఉండేవారు సొంత పార్టీతో సంబంధాలు లేనట్లుగా ఉంటారు. కానీ తమ్మినేని సీతారాం అలాంటి మొహమాటాలేం పెట్టుకోలేదు. నేరుగా తాను వైసీపీ సభ్యుడినేనని చెబుతున్నారు. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్పీకర్‌గా విధులు నిర్వహించేటప్పుడు కూడా అధికార పార్టీని తమ పార్టీ అని.. ఇతరుల్ని విపక్ష నేతలు అనే ఆయన అంటున్నారు.
ఇదీ చదవండి YCP vs Rebel: జగన్ ను ఢీ కొడుతున్న రెబల్ ఎమ్మెల్యేలు.. రాజకీయ సునామి తప్పదంటూ వార్నింగ్..
దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. మంత్రిగా అయితే ఇలాంటి దూకుడు మరింతగా చూపిస్తారని.. ప్రస్తుతం ఇదే కావాలని సీఎం జగన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలోనే తమ్మినేని సీతారాంకు మరోసారి మంత్రిగా బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ కుదరలేదు. ఇప్పుడు జగన్ పిలిచి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు కారణం.. ఇటీవల ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమే.. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు ధర్మానా, సీదిరి సరిగ్గా పని చేయలేదని పార్టీ పెద్దలు అంచనాకి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : : గ్రైండర్లు.. మిక్సర్లు వచ్చినా..? రుబ్బురోలుకు తగ్గని క్రేజ్.. ఆ కుటుంబాలకు ఇదే ఆధారం
శ్రీకాకుళం నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారిలో ఒకరు సీదిరి అప్పలరాజు. మరొకరు ధర్మాన ప్రసాదరావు. అంతకు ముందు ధర్మాన కృష్ణదాసు మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు స్పీకర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్నది కూడా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ పదవిని ఒకటి, రెండు సార్లు గెలిచిన వారికి ఇవ్వలేరు. సీనియర్ కావాలి. అందులోనూ మంచి విషయ పరిజ్ఞానం, సభా వ్యవహారాలపై పట్టు ఉన్న వారికి ఇవ్వాలి. అలాంటి నేతలు కొంత మంది ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సమీకరణాల రీత్యా ఈ సారి కూడా శ్రీకాకుళం జిల్లాకే స్పీకర్ పదవి వస్తుందంటున్నారు. ధర్మాన ప్రసాదరావును మంత్రి పదవి నుంచి తప్పించి స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ధర్మానకు ఏడాది కిందటే మంత్రి పదవి ఇచ్చారు. మరి ఆయన అంగీకరిస్తారా లేదా అన్నది కూడా కీలకమే. జగన్ ఆదేశిస్తే తప్పనిసరిగా అంగీకరించాల్సిందే.
మరో సీనియర్ మంత్రి.. ఉత్తరాంధ్రకే చెందిన బొత్స సత్యనారాయణ తీరుపైనా సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స అనుకున్నట్లుగా కష్టపడలేదని సీఎం జగన్ భావిస్తున్నారంటున్నారు. బొత్స లాంటి సీనియర్ మంత్రిని తప్పించే అవకాశం ఉండదని మరికొందరు భావిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి సీఎం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని ద్వితీయ శ్రేణి నేతలు అంచనా వేస్తున్నారు. కారణం ఏదైనా కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించిన తర్వాత మంత్రుల్లో దూకుడు తగ్గిపోయింది. దూకుడుగా ఉన్న నేతలకు ఉద్వాసన చెప్పడం.. కొత్తగా మంత్రి అయిన పార్టీ ఆదేశాలు వస్తే తప్ప నోరు తెరిచే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం. అందుకే మళ్లీ సీఎం జగన్ పాత కేబినెట్‌లో దూకుడుగా ఉన్న మంత్రులను మళ్లీ తీసుకోవాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, AP Politics, AP Speaker Tammineni Seetharam