AP POLITICS WHY JANASENA CHIEF PAWAN KALYAN NOT ATTEND PM MODI TOUR IS THERE ANY POLITICAL GAP WITH BJP NGS
Pawan Kalyan: బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ పెరిగిందా..? ప్రధాని సభకు పవన్ డుమ్మా.. కారణం అదే అంటున్న బీజేపీ నేతలు
పవన్ కళ్యాణ్ (file)
Pawan Kalyan: జనసేనతో తమది పటిష్టమైన పొత్తు అంటున్నారు బీజేపీ నేతలు.. బీజేపీ జాతీయ నాయకులతో తనకు సత్ససంబంధాలు ఉన్నాయని పవన్ చెబుతున్నారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. సాక్షాత్తూ ప్రధాని స్వయంగా భీమవరానికి వస్తే మిత్రపక్షంలో ఉండి కూడా పవన్ కల్యాణ్ ఆ సభకు వెళ్లకపోవడం వెనుక వేరే ఏ కారణాలు లేవంటున్నారు జనసేన నాయకులు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు పొత్తులు ఎలా ఉంటాయన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో తమ పొత్తు వచ్చే ఎన్నికలకు కొనసాగుతుందని బీజేపీ నేతలు (BJP Leaders) గట్టిగా చెబుతున్నారు. పవన్ సైతం.. తనకు బీజేపీ జాతీయ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు జాతీయ నేతలు రూట్ మ్యాప్ ఇస్తారని చెబుతూ వచ్చారు. కానీ తాజా పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు జనసేనాని హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు రాలేదనేదానిపై అన్ని పార్టీలు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగానే రాలేదా..? లేదా ఆహ్వానం సరిగా లేదా..? అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minster Kishan Reddy) ప్రత్యేకంగా ఆహ్వానించారని స్వయంగా పవన్ కల్యాణే చెప్పారు. అంతేగాదు కిషన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు కూడా చెప్పారు. స్వయంగా కేంద్ర మంత్రి పిలిచినప్పుడు.. ప్రధాని సభకు వస్తున్నప్పుడు.. మిత్రపక్షమైతే తప్పక సభకు మాత్రం హాజరు కావాలి.. కానీ పవన్ దూరంగా ఉన్నారు.
ఇప్పుడే కాదు గత కొద్ది కాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పవన్ కల్యాణ్.. బహిరంగ వేదికలపైన సైతం ఆయన ఈ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే భీమవరంలో జరిగిన సభకు హాజరుకాకపోవడం ద్వారా తన కార్యకర్తలకు ఆయన సిగ్నల్ ఇచ్చారని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఆయన పొత్తులపై బీజేపీ, టీడీపీలకు మూడూ ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఒకటి సింగిల్‌గా జనసేన పోటీ చేయడం లేదా బీజేపీతో కలిసి పోటీ చేయడం, లేదా బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేయడం. తాజాగా జరిగిన ఘటన ద్వారా ఆయన తొలి ఆప్షన్‌ను ఎంచుకున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన సింగిల్ గానే బరిలోకి దిగుతుందనే చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు టీడీపీతోనూ పొత్తుల అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగితే జనసేనకు పెద్దగా ఒరిగేదేమీ లేదనేది జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్‌కు చెబుతున్నమాట.. ముఖ్యంగా జనసేన వల్ల బీజేపీకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది తప్ప బీజేపీ వల్ల జనసేనకు సీట్లు పెరిగే అవకాశమే లేదనేది జనసేన ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు.
బీజీపీ నేతలు మాత్రం పవన్ రాకపోవడానికి వేరే కారణం ఉంది అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు అంటే.. పవన్ తో స్నేహం తాము కోరుకుంటున్నామనే విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇది బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమం అయితే కచ్చితంగా పవన్ వచ్చేవారని.. కానీ ఇది ప్రభుత్వం కార్యక్రమం.. అందులోనే సీఎం జగన్ స్వయంగా అన్ని వ్యవహారాలు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ తో కలిసి సభను పంచుకోవడం ఇష్టం లేకే పవన్ రాలేదని.. అలాగే తాను సభా వేదికపై ఉంటే.. అన్నయ్య చిరంజీవి కూడా కాస్త ఇబ్బంది పడాల్సి ఉండే అవకాశం ఉందని పవన్ భావించి ఉండొచ్చని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.