అంతా భావించినట్టే జరిగింది. ఉదయం మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ చెప్పడంతో.. రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది. ఆ వెంటనే ఏపీ కేబినెట్ (Ap Cabinet) అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం.. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు వంటి వాటిని వెనక్కి తీసుకోవడంపై నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన సీఎం జగన్.. తాము రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈ బిల్లు తీసుకొస్తే.. కొందరిని దీనిపై అపోహలు, అనుమానాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే మూడు రాజధానులకు(three capitals) సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని వివరించేందుకు.. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలు ఇస్తూ బిల్లును మరింత మెరుగుపచేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ (YS Jagan) తెలిపారు.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సవివరమైన బిల్లు మళ్లీ సభ ముందుకు వస్తుందని జగన్ ప్రకటించారు. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడంతో.. ఇప్పుడు ఏం జరుగుతుందనే అంశంపై చర్చ మొదలైంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన సీఎం జగన్.. మళ్లీ ఈ బిల్లులో మార్పులు చేసి సభ ముందుకు వస్తామని ప్రకటించారు.
అయితే దీనిపై రూపొందించే కొత్త బిల్లును ప్రభుత్వం ఎప్పుడు సభ ముందు ఉంచుతుందనే అంశాన్ని మాత్రం ఆయన వివరించలేదు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు కసరత్తు మొదలుపెడుతుందనే అంశంపై ఏపీ ప్రభుత్వ, రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. రాజధాని అంశం అనేది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం కావడంతో.. దీనిపై ఏదో ఒక స్పష్టత వచ్చేంతవరకు అందరి దృష్టి దీనిపైనే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి.. దీనిపై మరింత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందనే అంశంపై అందరి ఆసక్తి నెలకొంది.
Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..
Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి
మరోవైపు ప్రభుత్వం రాజధాని అంశంపై కొత్త కమిటీలు వేసే అవకాశం లేకపోలేదని చర్చ కూడా సాగుతోంది. మరోసారి ఈ అంశంపై అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందని... మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రాజధాని రైతులతో కూడా చర్చించాలనే యోచనలో కూడా ఉందని కనిపిస్తోంది. కాబట్టి ఇందుకోసం ప్రభుత్వం మరోసారి కమిటీలను రూపొందించే అవకాశం ఉందని.. ఆ దిశగా త్వరలోనే కసరత్తు మొదలుకావొచ్చని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.