AP POLITICS WHAT IS THE MAIN REASON TO INTERNAL FIGHT IN YCP LEADERS IN KONASEEMA DISTRICT NGS NJ
YCP Clashes: అక్కడ వైసీపీ నేతల మధ్య విబేధాలకు ఆయనే కారణమా..? రాజీనామాల పర్వం.. వెనుక మ్యాటర్ అదే!
రాజోలులో వైసీపీలో కలకలానికి ఆయనే కారణమా..?
YCP Clashes: మొన్నటి వరకు ఆ జిల్లాలో వైసీపీ చాలా పటిష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు బడా లీడర్ల నుంచి.. ద్వితీయ శ్రేణి నాయకులు ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొందరైతే అధికారంలో ఉన్న పార్టీకి కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ పరిస్థితి కారణం ఎవరు..?
YCP Clashes: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP)లో రోజు రోజుకూ వర్గ పోరు పెరుగుతోంది. మొన్నటి వరకు అంతర్గతంగానే కనిపించిన కలహాలు.. ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికే పరిస్థితి చేయి దాటింది. కీలక నేతల్లో కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా.. మరోవైపు ద్వితీయ శ్రేణి నాయకుల రాజీనామాలు సైతం పార్టీ పెద్దలకు ఆందోళన పెరిగేలా చేస్తోంది. అయితే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. వైఎస్సార్సీపీ (YSRCP)లో పార్టీలో ఉన్న వాళ్లకన్నా…మరోపార్టీ నుంచి జంప్ చేసిన వచ్చిన వాళ్లకే కిరీటాలనే ఆరోపణ ఉంది. అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉన్నా…పార్టీ పెద్దలను చూసి కొందరు సైలెంట్‌గా ఉంటున్నారు.. మరికొందరు బయటపడుతున్నారు.. ఇంకొందరు పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు రాజోలు (Rajolu) నియోజకవర్గంలోనూ అలాంటి పరిస్థితే నడుస్తోంది.
రాజోలు.. రాష్ట్రం మొత్తం మీద జనసేన గెలిచిన ఒకేఒక్క సీటు.. అయితే ఆ పార్టీ నుంచి గెలిచి అతి త్వరగా పార్టీ జంప్ అయిన ఎమ్మెల్యే రాపాక ఇప్పుడు ఆ పార్టీలో వాళ్లకు నిద్రపట్టనీయడం లేదంట. రాపాక వైఎస్సార్సీపీలోకి వచ్చినప్పటి నుంచి రాజోలు రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. ఆ పార్టీ జిల్లా ఇంఛార్జులు మారిపోవడం.. నేతల మధ్య సఖ్యత లేకవడం…ఒకరంటే మరోకరికి పడకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇన్నాళ్లు ఇలా లోలోపల గొడవలు పడుతున్న నేతలు..ఇంక తమ వాళ్ల కాదని పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. అలా సొంతపార్టీ నేతలే ఆ పార్టీకి దూరమవ్వడం వెనక జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (Rapaka Varaprasad) వైఖరే కారణమని వైఎస్సార్సీపీ శ్రేణులు అనుకుంటున్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజుల్లోనే రాపాక కండువ మార్చేయడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారినా..జనసేనకు భవిష్యత్ లేదనే భావనతో మరికొందరు ఆయన వెంట నడిచి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. అయితే ఇలా వేరే పార్టీ నుంచి వచ్చిన వారితో పోలిస్తే.. మొదటి నుంచి అదేపార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యం దక్కట్లేదనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ అసంతృప్తి చాలా సార్లు బయటపడినా..చూసిచూడనట్లు పార్టీపెద్దలు వదిలేశారు కానీ ఏ రోజు సీరియస్‌గా తీసుకోలేదు.
పార్టీ పెద్దల నుంచి ఎలాంటి పరిష్కార యత్నం కనిపించకపోవడంతో… విసిగిపోయిన అసంతృప్తి నేతలు ఇక లాభం లేదనుకుని ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అలా రాజీనామా చేసిన వాళ్లే రాజోలుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు. ఎమ్మెల్యే రాపాక రాకను మొదటి నుంచి వ్యతిరేకించిన రామరాజు పార్టీ పెద్దల నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ రాపాక ఆధిపత్యం, నాయకత్వం తమకు వద్దని కనీసం దీనిలోనైనా తమ నిర్ణయాన్ని మార్చుకోమని పార్టీ పెద్దలను కోరారు. కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో.. చేసేదిలేక ఆయనే ఆ పార్టీని వీడారు. ఆయన వెంట ఆ పార్టీకి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శి సాగి రామరాజు.. నియోజకవర్గ బూత్ కమిటీ ఇంఛార్జ్ సుందరపు బుల్లబ్బాయి సైతం రాజీనామా చేసేశారు.
ఎమ్మెల్యే రాపాక ఎంట్రీతోనే రాజోలు వైఎస్సార్సీపీలో ముసలం మొదలయిందనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే రాపాకను పార్టీ ఇంఛార్జ్‌గా ప్రకటించడం.. ఆ వర్గపోరుకు మరింత ఆజ్యం పోసినట్లయింది. తన సామాజికవర్గానికే రాపాక ప్రాధాన్యం ఇవ్వడం.. వైఎస్సార్సీపీలోని మిగతా నేతలకు అస్సలు నచ్చడం లేదని సమాచారం.
ఎమ్మెల్యే రాపాక వైఖరి నచ్చక మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులు సైతం రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజోలు వైసీపీ కోఆర్డినేటర్లుగా పనిచేసిన బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజీలు మొదటి నుంచి రాపాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఎవరి వర్గం వారిదే. బొంతకు, అమ్మాజీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినా కలిసి పనిచేసే పరిస్థితి లేదు.
ఇలా మొదటినుంచి పార్టీలో ఉన్న వాళ్లంతా ఒక్కొక్కరు పార్టీని వీడుతుంటే…పార్టీ పెద్దలు చూస్తు ఎలా ఉన్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ సమస్య మరింత ఎక్కువయ్యేలోపే పార్టీపెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.