M Bala Krishna, News18, Hyderabad
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) లో ఆమె చాలా కీలక నేత. పార్టీలో అత్యున్నత పదవిలో ఉన్నారామె. ఆమె సీఎం జగన్ (AP CM YS Jagan) మాతృమూర్తి వైఎస్ విజయమ్మ (YS Vijayamma). జగన్ తల్లిగానే కాకుండా జగన్ స్థాపించిన వైఎస్ ఆర్సీపీ పార్టీ గౌరవ అద్యక్షురాలుగా పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. 2019 ఎన్నికల ముందు వరకు పార్టీలో చాలా కీలకంగా వ్యవహారించిన విజయమ్మ ఇప్పుడు మాత్రం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆమె పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే విజయమ్మ ఇలా దూరం ఉండడం వెనుక కారణాలేంటనే చర్చ జరుగుతుంది. పార్టీ వ్యవహారాలకు తానే దూరంగా ఉంటున్నారా? లేకా దూరం పెట్టారా అనే సందేహాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.
జగన్ ఏపీ సీఎం అయిన తరువాత కొద్ది రోజులు అక్కడక్కడా కనిపించిన విజయమ్మ తరువాత మాత్రం పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, జయంతి సందర్భల్లో తప్ప ఆమె ఎప్పుడూ కనిపించడం లేదు. ఈ మూడేళ్లలో ఒకటి రెండు సార్లు మాత్రమే ఆమె తాడేపల్లిలో కనిపించారు. తరువాత కనీసం ఇటువైపు కూడా చూడాలేదు.
గత ఏడాది డిసెంబర్లో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలకు కూడా విజయమ్మ దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ కూడా విజయమ్మను పెద్దగా పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు పార్టీలో కీలక నేతలు కూడా ప్రస్తుతం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. మొన్నటికి మొన్న కొత్త కేబినేట్ లో చోటు దక్కించుకున్న మంత్రులు కూడా కనీసం గౌవరవార్ధం కూడా విజయమ్మను కలవలేదు.
ఒక్క నగరి ఎమ్మెల్యే రోజా మినహా ఎవరు కూడా విజయమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకోలేదు. అయితే ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి విజయమ్మ ఇలా అంటి ముట్టనట్లు ఉండడానికి కారణాలు ఉన్నాయంటున్నాయి వైసీపీ వర్గాలు. వివేకానంద హాత్య తరువాత కటుంబంలో ఏర్పడిన మనస్పపర్ధలే ఇందుకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ కుటుంబం మొత్తం ఈ విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానం పట్ల తీవ్ర అసంతృప్తగా ఉన్నట్లు టాక్. అది నచ్చకే విజయమ్మ కూడా పార్టీ విషయంలో అంటి ముట్టనట్లు ఉంటున్నట్లు సమాచారం.
మరో వైపు మొన్న జరిగిన విజయమ్మ పుట్టిన రోజు వేడుకలను కూడా పార్టీ తరపున ఎవరూ నిర్వహించలేదు. కనీసం పార్టీ నేతలు కూడా ఆమెకు విషెస్స్ చెప్పిన పాపాన కూడా పోలేదు. ఎన్నికలకు ముందు జగన్ తో ఏం మాట్లాడాలన్నా విజయమ్మను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు తహాతహాలాడేవారు. కానీ ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక పార్టీలో విజయమ్మను కూరలో కరివేకపాకులా తీసిపడేస్తోన్నారనే వాదనలు వినిపిస్తోన్నాయి. అది నచ్చకే విజయమ్మ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ కే పరిమితమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే జగన్ తీరుతో అసంతృప్తిగా ఉన్న వైఎస్ షర్మిల ఆయనకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో పార్టీపెట్టి తన రాజకీయ ప్రయత్నాలు సాగిస్తున్నారు. బ్రదర్ అనీల్ కుమార్ కూడా ఏపీలో కొత్త పార్టీ పెట్టడానికి సన్నహాలు చేస్తున్నారు. ఇలా ఒకప్పుడు పార్టీలో కీలకం మారిన వ్యక్తులందరూ ఇప్పుడు పార్టీకి అటిముట్టనట్లు ఉండడం తీవ్ర చర్చనీయాంశమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.