విజయవాడ (Vijayawada) ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ కు సంబంధించి ఇంకా రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య రోజూ మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నేతల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. గ్యాంగ్ రేప్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు ఫిర్యాదులిస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత బొండా ఉమా స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత ఓ రేంజ్ లో విమర్శల తూటాలు పేలాయి. బుధవారం తెలుగు మహిళల ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. అనంతరం బాధితురాలి తల్లితో ఫిర్యాదు ఇప్పించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడుల ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ తెలుగుమహిళలు వాసిరెడ్డి పద్మను నిలదీశారు. మహిళా కమిషన్ ను ప్రశ్నించే హక్కు తమకుందని.. విజయవాడ ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. తొలుత తెలుగు మహిళలను పోలీసులు అడ్డుకోగా.. కాసేపు వాగ్వాదం తర్వాత లోనికి అనుమతించారు. అనంతరం విజయవాడ గ్యాంగ్ రేప్ ఘటనపై వాసిరెడ్డి పద్మకు వినతిపత్రం అందజేశారు. అంతేకాదు జగన్ పాలనలో ఊరికో ఉన్మాది అనే పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు ఇచ్చి రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల్లో ఎంతమందికి నోటీసులిచ్చారో చెప్పాలని ప్రశ్నించగా.. పుస్తకాన్ని పరిశీలించి సమాధానమిస్తానని వాసిరెడ్డి పద్మ అన్నారు.
తెలుగు మహిళల నిరసనకు వాసిరెడ్డి పద్మ స్పందించారు. చంద్రబాబు, బొండా ఉమాకు నోటీసులిచ్చామనే.. మహిళలతో నిరసనలు చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. మహిళలతో ఎలా ఉండాలో చెప్పడానికే చంద్రబాబుకు నోటీసులిచ్చామని.. అత్యాచార బాధితురాలి విషయంలో టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో టీడీపీ పది తప్పులకు పాల్పడిందని.. అంతా కలిసి బాధితురాలి దగ్గరకు వెళ్లడం.., బాధితులను భయపెట్టడం, సుప్రీ కోర్టుకు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడం, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను అడ్డుకోవడం, అసభ్య పదజాలంతో దూషించడం, బాధితురాలి కుటుంబాన్ని మీడియా ముందు చూపించడం వంటి తప్పులకు టీడీపీ పాల్పడిందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
ఇది చదవండి: అలకవీడని ఏపీ మంత్రి.. రివ్యూలకు దూరం..? కారణం ఇదేనా..?
ఐతే ఈ వ్యవహారంలో బాధితురాలి కుటుంబ సభ్యుల ఎదుటే.. అటు అనిత, అటు వాసిరెడ్డి పద్మ వాదనలాడుకోవడం చర్చనీయాంశమైంది. బాధితురాలి పరామర్శ సందర్భంగా వాసిరెడ్డి పద్మ, టీడీపీ నేత పంచమర్తి అనురాధ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో మహిళా నేతలు పోట్లాడుకోవడం విమర్శలకు తావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, TDP, Ysrcp