ఆంధ్రప్రదే లో ఓపైవు పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సమయంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం దుమారం రేపుతోంది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అనే నినాదం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ అధికార వైఎస్ఆర్సీపీతో పాటు టీడీపీ, వామపక్షాలు గళమెత్తాయి. ఈ విషయంలో జనసేన, బీజేపీలు మాత్రం ఒకింత ఇరుకునపడ్డాయి. బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర బీజేపీ నేతలు వ్యతిరేకించలేరు. బీజేపీతో పొత్తు కారణంగా జనసేన కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో బీజేపీ కంటే జనసేన పార్టీనే ఎక్కువ చిక్కుల్లో పడే అవకాశముంది.
పవన్ పైనే ఒత్తిడి
స్టీల్ ప్లాంట్ విషయంలో అందరికంటే ఎక్కువగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనే ఒత్తిడి పడింది. దీనికి కారణం గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయడమే. విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గ పరిధిలోనే ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ పవన్ కల్యాణ్ కు 57వేల ఓట్లు వచ్చాయి. ఒక విధంగా తన సొంత నియోజకవర్గమైన గాజువాకలో ఇంతపెద్ద సమస్య వస్తే అందరికంటే ముందు స్పందించాల్సింది పవన్ కల్యాణే. స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్షమంది ఆధారపడి ఉన్నారు. వీరిలో మెజారిటీ జనభా గాజువాక పరిధిలోనే ఉన్నారు. దీంతో పవన్ తమ పక్షాన పోరాడాలని స్థానికులు సహజంగానే కోరుకుంటారు. ఐతే బీజేపీతో పొత్తు కారణంగా పవన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
గతంలో సక్సెస్
గతంలో విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణను పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో ఉద్యోగులు, స్థానికులు చేపట్టిన ఆందోళనకు ప్రత్యక్షంగా వెళ్లి మద్దతిచ్చారు. పవన్ ఎఫెక్టో, ఉద్యోగులు, స్థానికుల వ్యతిరేకిత ఎఫెక్టో తెలియదుగానీ కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. ఇప్పుడు కూడా పవన్ అదే స్టాండ్ తీసుకొని కేంద్రంపై పోరాడాలని స్థానికులు, ఉద్యోగులు కోరుతున్నారు. ఐతే పొత్తు ధర్మ దృష్ట్యా బీజేపీని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకించడం కుదరని పని. అలా జరిగితే రాష్ట్రంలో జనసేన-బీజేపీ పొత్తుకు బీటలు వారినట్లే.
త్వరలో ఢిల్లీకి పవన్
ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జనసేన పార్టీ వ్యతిరేకమంటూ ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. మరి పవన్ వినతి పత్రం ఇవ్వడానికే పరిమితమవుతారా.. లేదా కేంద్రాన్ని ఒప్పించేవరకు సీరియస్ గా ట్రై చేస్తారా అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, AP Politics, Bjp, Bjp-janasena, CPI, CPM, Janasena party, Pavan kalyan, Pawan kalyan, TDP, Telugu news, Visakhapatnam, Vizag, Vizag Steel Plant, Ysrcp