విజయవాడ (Vijayawada) తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ఎంపీ కేశినేని నాని (MP Kesineni Nani) కుటుంబంలో రాజకీయ వైరం మరింత ముదురుతోంది. ఇప్పటికే టీడీపీ (TDP) అధిష్టానానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఆయన.. తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు. తాజాగా తన సోదరుడు కేశినేని శివనాథ్ పై కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుపై స్టిక్కర్ ను కారణంగా చూపిస్తూ ఆయన కంప్లైంట్ ఫైల్ చేశారు. కొందరు తన పేరు హోదాను దుర్వినియోగం చేస్తున్నారని.. తన పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని.. తాను వినియోగించే వీఐపీ వాహన స్టిక్కర్ ను పోలిన నకిలీ స్టిక్కర్ వినియోగించి హైదరాబాద్, విజయవాడలో తిరుగుతున్నారన్నారు. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మే 27న ఆయన పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేశినేని నాని ఫిర్యాదుపై జూన్ 9న ఎఫ్ఆఆర్ నమోదైంది. నాని ఫిర్యాదు మేరకు నిందితులపై 420, 415, 416, 468, 498 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. సదరు వాహనం నెంబర్ టీఎస్07డబ్ల్యూ 7777. ఈ వాహనం కేశినేని జానకీలక్ష్మి పేరిట ఉంది. ఆ కారును ఆమె భర్త, కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని వినియోగిస్తున్నారు. సోదరుడిపైనే కేశినేని నాని ఫిర్యాదు చేయడం విజయవాడలో సంచలనంగా మారింది.
కేశినేని శివనాథ్ కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కేశినేని నాని స్థానంలో కేశినేని శివనాథ్ టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబే.. నానికి వ్యతిరేకంగా శివనాథ్ ను ప్రోత్సహిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. కొంతకాలంగా కేశినేని నాని పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. టీడీపీ మహానాడుకు కూడా ఆయన హాజరుకాలేదు.
మరోవైపు విజయవాడలోని పలువురు నేతలతో నానికి పొసగడం లేదు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని చంద్రబాబు.. కేశినేని నానికి అప్పగించినా బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ఆయనకు ఎదురుతిరిగారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో విబేధాలు మరింత భగ్గుమన్నాయి. మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ప్రకటించడాన్ని బుద్ధా వెంకన్న, బొండా ఉమాతో పాటు పలువురు నేతలు వ్యతిరేకించారు.
అటు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని జగ్గయ్యపేట, మైలవరం వంటి నియోజకవర్గాల నేతలతోనూ కేశినేని నానికి సత్సంబంధాలు లేవు. దీంతో కేశినేని నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా.. అదే సమయంలో ఆయన సోదరుడు కేశినేని శివనాథ్.. టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శివనాథ్ పై కేశినేని నాని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kesineni Nani, Vijayawada