ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొన్నిచోట్ల పోలింగ్ నిలిపేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సాకుర్రుగున్నెపల్లెలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లపై జనసేన గుర్తు లేకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థితో పాటు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో పోలింగ్ కేంద్రంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు పోలింగ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాలెట్ పేపర్ పై గుర్తు మిస్ అవడంపై పోలింగ్ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. పొరబాటున ఇలా జరిగి ఉంటుందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు. మరోవైపు జనసేన మాత్రం అధికార పార్టీ కుట్రతోనే జనసేన గుర్తు లేకుండా చేసిందని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్తి డిమాండ్ చేస్తున్నారు. ఇక ముమ్మిడి వరం మండలంలో బ్యాలెట్ పేపర్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం కలకలం రేపింది.
ఇక గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. సత్తెనపల్లి మండలం గోనెపూడిలో టీడీపీ ఏజెంట్లు, ఓటర్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కూడా వైసీపీకే సహకరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం, మాముడూరులో వైసీపీ ఏజెంట్లపై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం తెలపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షన జరిగింది. దీంతో అధికారులు పోలింగ్ నిలిపేశారు. రౌడీ షీటర్లను పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారంటూ మహిళా అభ్యర్థి అభ్యంతరం చెప్పడంతో ఏజెంట్లు ఆమెపై దాడి చేశారు. ఘటనలో నలుగురు మహిళలకు గాయాలైన్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. బ్యాలెట్ పేపర్ పై విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థి ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు పోలింగ్ ను రేపటికి వాయిదా వేశారు.
చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కీళంబాకంలో గ్రామస్తులు పోలింగ్ ను బహిష్కరించారు. ఓట్లు వేయాలని అధికారులు గ్రామస్తులను కోరగా.. టీడీపీ బరిలో లేకపోవడంతో తాము కూడా ఓట్లు వేయమని చెప్పినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ లో టీడీపీ అభ్యర్థి రాజేశ్వరితానే పోలింగ్ ఏజెంటుగా ఉంటానని చెప్పడంతో కలకలం రేగింది. రాజేశ్వరిని ఎన్నికల సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు పోలింగ్ కు బ్రేక్ పడింది. జిల్లలో 400పైగా ఓట్లు ఉన్న ఓ గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి, ఆయన కుమారుడి ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మిగిలిన గ్రామస్తులంతా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.