ఏపీలో ఎలక్షన్లు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు కొద్దికొద్దిగా హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ (YSRCP) లో వర్గపోరులు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. నిన్నటి నిన్న మచిలీపట్నం (Machilipatnam) లో పేర్ని నాని, బాలశౌరి వర్గీయులు బాహాబాహీకి దిగగా.. గన్నవరం ఎమ్మెల్యేని విలన్‌తో పోల్చిన యార్లగడ్డకు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2019 గన్నవరం అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓ విలన్‌పై పోటీ చేసి ఓడిపోయానని.. అతడిని పార్టీలోకి తీసుకోవడాన్ని కూడా తాను వ్యతిరేకించినట్లు యార్లగడ్డ వెంకట్రావు నిన్న మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేయడంపై వంశీ ఇవాళ స్పందించారు. తాను విలనో, హీరోనో గన్నవరం ప్రజలకు తెలుసునని.. జగన్‌మోహన్ రెడ్డికి మద్దతు తెలపడంతో ఆయన తనకి గన్నవరం బాధ్యతలు అప్పగించారని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.
ఈ విషయమై ఏదైనా ఇబ్బంది ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలని.. ఇంకా బాధుంటే నేరుగా జగన్ దగ్గరికి వెళ్లొచ్చని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుని ఉద్దేశిస్తూ వంశీ వ్యాఖ్యానించారు. ఉంగుటూరు మండలం పొణుకుమాడు గ్రామంలో శనివారం గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న వల్లభనేని వంశీ వైఎస్సార్‌సీపీకి చెందిన యార్లగడ్డ, దుట్టా టార్గెట్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ చౌదరిలుగా రోడుపై వెళ్లే ప్రతివాడూ కామెంట్స్ చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డే చూసుకుంటారని.. తనకు ప్రజల ఆశీర్వాదం ఉందని వంశీ అన్నారు.
'నేను 15 సినిమాలు తీశాను. నా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో క్యారెక్టర్లని చూశాను. ఊరు వదిలి, దేశం వదిలి వెళ్లి హడావుడి చేసే ఎంతో మందిని నేను చూశాను. నేను హీరోనో, విలన్‌నో గన్నవరం ప్రజలను అడిగితే చెబుతారు. నేను విలన్ అన్నవాడు అతనో హీరో మహేష్ బాబు, అతని పక్క ఉన్న వ్యక్తి హీరో ప్రభాస్ కాదు కదా' అంటూ వంశీ తనదైన శైలిలో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు.
మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలపై వంశీ స్పందించారు. మట్టి గురించి నానాయాగీ చేసే ఒక నాయకుడేమో అపార్ట్ మెంట్ కట్టడానికి, మరొక ప్రముఖుడు ఆస్పత్రి నిర్మాణానికి, ఇంకొకరు చెరువు పూడ్చుకోవడానికి మట్టి ఎక్కడ నుంచి తరలిస్తున్నారు.. పక్క ఊరి నుంచి కాదా అని ప్రశ్నించారు. వీళ్లంతా కలిసి పేదవాడికి మట్టి అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లతో మట్టిని నాలుగు కిలోమీటర్లు తోలితే కనీసం డీజిల్ ఖర్చులు కూడా రావన్నారు. వీళ్లంతా చంద్రబాబు స్కూల్‌కు చెందిన వాళ్లని.. బురద జల్లుతాం, తారు వేస్తాం బాధ్యత మీదే అన్నట్టు వ్యవహరించేవాళ్లంటూ యార్లగడ్డ ఆరోపణలను కొట్టిపడేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.