వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna murali), అలీలకు(Ali) ఏ రకమైన పదవులు ఇస్తారనే అంశంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. అలీని వైసీపీ తరపున రాజ్యసభకు పంపుతారని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంకు ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో అలీ సీఎం జగన్ను(YS Jagan) కలిసిన తరువాత దీనిపై మరింత చర్చ జరిగింది. అలీకి సీఎం జగన్ ఏదో ఒక పదవి ఇవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలీకి నామినేటెడ్ పదవి ఇచ్చే విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే తాజాగా అలీ, ఆయనతో పాటు వైసీపీలో మొదటి నుంచి కొనసాగుతున్న మరో నటుడు పోసాని కృష్ణమురళికి నామినేటెడ్ పదవులు కేటాయించే అంశంపై ఏపీ సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇక పోసాని కృష్ణమురళికి కీలకమైన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కనుందని సమాచారం. ఈ ఇద్దరికి పోస్టులు కేటాయించే అంశానికి సంబంధించిన ఫైలు సీఎం జగన్ దగ్గరకు చేరిందని.. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఇద్దరికీ ఒకేసారి నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
CM Jagan Kadapa Tour: సొంత జిల్లాకు సీఎం జగన్.. రేపటి నుంచి మూడు రోజుల పర్యటన.. పూర్తి వివారలు ఇవే
ఒక్క అలీకి మాత్రమే నామినేటెడ్ పోస్టు కేటాయిస్తే.. పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ న్యాయం చేయలేదనే వాదన తెరపైకి వస్తుందని.. కాబట్టి ఇద్దరికీ ఒకేసారి నామినేటెడ్ పోస్టులు కేటాయించాలనే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉందని తెలుస్తోంది. అయితే గతంలోనే అలీకి పదవులు ఇస్తారనే చర్చ అనేకసార్లు జరిగింది. కానీ అది వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈసారైనా అలీకి గుడ్ న్యూస్ వస్తుందా ? లేక మళ్లీ ఆయనకు నామినేటెడ్ పోస్టు కేటాయింపు అంశం వాయిదా పడుతుందా ? అన్నది తేలాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Posani Krishna Murali